రాష్ట్రానికి రూ.లక్షా 40 వేల కోట్లు ఇచ్చాం: బీజేపీ
దీనిపై సీఎం, టీడీపీ నేతల అసహనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులే రావట్లేదని సీఎం చంద్రబాబు అంటే రూ.లక్ష కోట్లకుపైగా నిధులు ఇచ్చినట్టు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు ఏకరువు పెట్టారు. విభజనతో ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు నిధులిస్తామని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు రూ.2,303 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా రూ.13,776 కోట్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రం ఇస్తానన్న నిధులివ్వకుంటే రాష్ట్రం తీవ్ర ఇక్కట్ల పాలవుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేణుగోపాలరెడ్డి తదితరులు సైతం కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఘర్షణ తమ వైఖరి కాదని చెప్పుకొచ్చారు.
అయితే వీరితో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు విభేదించారు. రాజమండ్రిలో ఇటీవల జరిగిన బహిరంగసభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన లెక్కల్ని చదివి వినిపించారు. రూ.లక్షా 40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని కేంద్రప్రభుత్వం ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ అంటే తమ పార్టీకి ఎంతో ప్రేముందని చెప్పుకొచ్చారు. దీనిపై టీడీపీ నేతల్లో, సీఎంలో అసహనం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్‌రాజు ప్రసంగానికి చంద్రబాబు బ్రేకులు వేశారు. ప్రాజెక్టుల అంచనాలను కేటాయింపులకింద ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం తర్వాత కూడా విష్ణుకుమార్‌రాజు పట్టువీడలేదు. సీఎం అపార్థం చేసుకున్నారంటూ కేంద్రం నుంచి రూ.లక్షా 40 వేల కోట్లు వచ్చినట్టు చెప్పి కూర్చున్నారు.