- దండుమైలారంలో ‘భూ మాయ’ వెనకా గోల్డ్‌స్టోన్
- రూ.15 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్
- 2011లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా దండుమైలారం శివారులోని హాఫీజ్‌పూర్‌లో రూ.15 కోట్ల విలువైన ‘భూ మాయ’వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. మియాపూర్ తరహాలో ఇక్కడ కూడా గోల్డ్‌స్టోన్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. సర్వే నంబరు 36లోని 50 ఎకరాల ప్రభుత్వ/అటవీ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గోల్డ్‌స్టోన్, విర్గో గ్లోబల్ ప్రతినిధులు పి.ఎస్.ప్రసాద్, పార్థసారథి, పీవీఎస్ శర్మ తదితరులు.. బంజారాహిల్స్‌కు చెందిన గద్వాల విజయలక్ష్మి, మరో ఇరువురి పేరిట గతేడాది (4486/2016 డాక్యుమెంట్) రిజిస్ట్రేషన్ చేశారు.
నిజాం వారసులు, పైగా కుటుంబీకుల అస్తులకు సంబంధించిన (సీఎస్ 14/1958) భూ వివాదం కేసులో హైకోర్టు 2010 ఫిబ్రవరిలో తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందని గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ దస్తావేజులో పేర్కొన్నారు. కోర్టు డిక్రీ మేరకు తన పేరిట వివిధ ప్రాంతాల్లోని భూములను మ్యుటేషన్ చేయాలని ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, బాలానగర్ తహసీల్దార్లకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ(ఎల్‌సీ 1/356/2010) రాసినట్లు ఆయన 2011లో చేయించుకున్న రిజిస్ట్రేషన్ దస్తావేజులో పేర్కొన్నారు.
ఇలా సంక్రమించిన భూమిలో 50 ఎకరాలను బంజారాహిల్స్‌కు చెందిన గద్వాల విజయలక్ష్మి, మరో ఇరువురికి విక్రయించినట్లుగా 2016 మే నెలలో సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. తహసీల్దార్లకు కలెక్టర్ రాసినట్లుగా చెబుతున్న లేఖ ప్రతులు, రెవెన్యూ పరమైన రికార్డ్ ఆఫ్ రైట్స్ పత్రాలను సమర్పించకపోయినా.. ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సలేహా ఖాదిర్ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. పైగా అవి సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములు కావడం గమనార్హం.
ప్రభుత్వ భూములు హాంఫట్
హాఫీజ్‌పూర్ సర్వే నంబర్ 36/1లో 1,822 ఎకరాలు, 36/2లో 422 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. 1954–55 నుంచి సర్కారీ, అటవీ భూములుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. విజయవాడ హైవేకు దగ్గరగా ఈ భూములు ఉండటంతో ఎకరం రూ.30 లక్షల దాకా పలుకుతున్నాయి. మియాపూర్ భూము ల తరహాలోనే ఈ భూములను దక్కించుకునేందుకు గోల్డ్‌స్టోన్ టెక్నాలజీ లిమిటెడ్ యజమాని పి.ఎస్.ప్రసాద్ స్కెచ్ వేశాడు. నిజాం వారసులు, పైగా కుటుంబీకుల నుంచి గోల్డ్‌స్టోన్ సంస్థ పేరుతో జీపీఏ చేసుకొని దాని అనుబంధ సంస్థలను చేర్చారు.
వాటిలో విర్గో గ్లోబల్ మీడియా, గ్రేటర్ గోల్కొండ ఎస్టేట్స్, సాయి పవన్ ఎస్టేట్స్, సాయి అనుపమ ఏజెన్సీ, సాయికీర్తి కన్‌స్ట్రక్షన్స్, జయశ్రీ ఏజెన్సీస్, కీర్తి అనురాగ్ ఇన్వెస్ట్‌మెంట్,, మ్యాట్రిక్స్ ఇన్సూలేటర్స్, జల్ ఇన్‌ఫ్రాస్టక్చర్, సబేరా కన్‌స్ట్రక్షన్, న్యూటెక్ స్టీవింగ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్, గ్లోమాస్క్ టెక్నాలజీస్, సత్యసాయి అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, గోల్కొండ ఎక్స్‌ట్రషన్స్, ఇండియా టెలికాం ఫైనాన్స్, సువిశాల్ పవర్ జనరేషన్, ఆర్‌జీఎల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల తరపున స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు పార్థసారథి, ఇంద్రాణి ప్రసాద్, మహిత ప్రసాద్, సునీత ప్రసాద్ తదితరులు 50 ఎకరాల సర్కారు భూమిని, గద్వాల విజయలక్ష్మి, కంచర్ల నవజ్యోత్, జ్యోత్స్నలకు 2016లో రిజిస్ట్రేషన్ చేశారు.
ఎంతో కాలంగా పెండింగ్
ఈ భూములకు సంబంధించి 2015లో సమర్పించిన సేల్‌డీడ్‌కు పాస్ పుస్తకాలు లేవనే కారణంగా అప్పటి సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ సలేహా ఖాదిర్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016 మే 12న ఈ డాక్యుమెంట్‌ను ఆమె క్లియర్ చేసినట్లు తెలిసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతాలు బట్టబయలు చేస్తున్న క్రమంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. అక్రమ రిజిస్ట్రేషన్‌కు బాధ్యురాలైన సలేహాను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
అవి సర్కారు, అటవీ భూములే
హాఫీజ్‌పూర్‌లోని 36/1, 36/2 సర్వే నంబర్లలోని 1,822 ఎకరాలు, 22 ఎకరాల 29 గుంటల భూములు సర్కారు, అటవీ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. 22/ఏ గెజిట్ ప్రకారం ఈ భూములును రిజిస్ట్రేషన్ చేసేందుకు వీల్లేదు.
– వెంకట్‌రెడ్డి తహసీల్దార్, ఇబ్రహీంపట్నం
రిజిస్ట్రేషన్ అక్రమమే
గద్వాల విజయలక్ష్మి, నవజోత్, జ్యోత్స్న పేర్లపై 50 ఏకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. సంవత్సరం పాటు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెం ట్‌ను మే 2016లో క్లియర్ చేశారు. పార్థసారథి, ప్రసాద్‌లకు భూమిపై హక్కులున్నట్లుగా ఆధారాల్లేవు.
– మధుబాబు, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్