చట్టసభల ప్రసంగాలు విలువైనవి
హైదరాబాద్: చట్టసభల ప్రసంగాలు ఎంతో విలువైనవని, ప్రగతి సాధించడానికీ, క్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుగొనడానికీ ఇవి సరైన వేదికలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సోమవారమిక్కడ ఎంపీ టి.దేవేందర్ గౌడ్ శాసనసభ ప్రసంగాల పుస్తకాల (2004-2009) ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోశయ్య పుస్తకాలను (పార్ట్ 1, పార్ట్ 2)ఆవిష్కరించి ప్రసంగించారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేసే ప్రసంగాలు ప్రతి ఏటా రికార్డు అవుతాయని, చట్టసభల్లోని గ్రంథాలయంలో ప్రజాప్రతినిధులు చేసిన ప్రసంగాలు లభ్యమవుతాయని చెప్పారు.
గ్రంథాలయాలకు వెళ్లి పాత ప్రసంగాలు తిరగేసే వాళ్లలో తానూ ఒకడినని చెప్పారు. ఒకప్పుడు గ్రంథాలయానికి హేమాహేమీలు వచ్చేవారని, కుర్చీ లభించకుంటే ఖాళీ అయ్యే వరకు అక్కడే వేచి ఉండేవాళ్లమని అన్నారు. శాసనసభలో గ్రంథాలయం ఎప్పుడూ అంత బిజీగా ఉండేదని, నేడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. శాసనసభ ప్రసంగాల్లో ఎక్కడా తొందరపాటు లేకుండా విషయానికి ప్రాధాన్యత ఇస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ దేవేందర్ గౌడ్ సమర్థవంతమైన పాత్ర పోషించారని ప్రశంసించారు.
టీడీపీలో అగ్రశ్రేణి నాయకుడిగా దేవేందర్ గౌడ్ ఉంటే, తాను కాంగ్రెస్‌లో చురుకైన ప్రజాప్రతినిధిగా ఉండేవాడినని గుర్తు చేశారు. ఇద్దరం శాసనసభకు హాజరయ్యే వారిమని, తమలో వ్యక్తిగత స్పర్థలు ఉండేవి కావన్నారు. సభ వేడివేడిగా జరుగుతున్నప్పటికీ బయటకు వస్తే మిత్రులుగానే ఉండేవారమని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, ఫలవంతమైన నిర్ణయాలు జరగాలని అప్పుడే సభ ఔన్నత్యం మరింత ద్విగుణీకృతం అవుతుందన్నారు. దేవేందర్ గౌడ్ ప్రసంగాలు ఈతరం వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో తాను పసిగుడ్డు అని చెప్పారు. ప్రజాప్రతినిధుల్లో దూరదృష్టి ఉండాలని ఏపీ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.