Devender Goud
-
బీజేపీలోనే కొనసాగుతా
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌తో పాటు, తాను కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నామన్న ఊహాగానాలకు బీజేపీనేత తూళ్ళ వీ రేందర్‌గౌడ్ తెరదించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దేవేందర్‌గౌడ్‌ని కలిసిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను కలిసిన అనంతరం వీరేందర్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిపై ఉన్న గౌరవంతోనే మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమను కలిశారని, వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంజయ్‌తో చర్చించినట్లు వీరేందర్‌గౌడ్ తెలిపారు. -
కేసీఆర్ వ్యతిరేకులను కూడగడతా
మహేశ్వరం, తుక్కుగూడ: రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో కలిసొచ్చే వారిని కలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్, ఆయన కుమారులతో కాం గ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన దేవేందర్ గౌడ్ అనుభవాలు సలహాలు, సూచనలు తెలంగాణ ప్రజలకు అవసరమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయ వనరులు తెలంగాణకే దక్కాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్‌గౌడ్ అని చెప్పారు. దేవేందర్‌గౌడ్ ఆనాడు ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు పాదయాత్ర చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కారు దారి తప్పిందని, దివాలా తీసిన తెలంగాణను పట్టాలెక్కించేందుకు అందరి ఆలోచనలు, అనుభవాలను స్వీకరిస్తామన్నారు. ప్రాజెక్టుల పేరిట కల్వకుంట్ల కుటుంబం కోట్లు దండుకుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటులో దేవేందర్ పాత్ర కీలకం: మధుయాష్కీ 70 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమాన్ని గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలంగాణకు రావాల్సిన వనరుల గురించి పార్లమెంటులో కొట్లాడారని మధుయాష్కీగౌడ్ గుర్తు చేశారు. అంతకుముందు దేవేందర్ గౌడ్, ఆయన కుమారులు పుష్పగుచ్ఛం అందజేసి రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డి : టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆయనను నగరంలోని తన నివాసంలో కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ దేవేందర్‌గౌడ్‌ను భట్టి ఆహ్వానించారు. కాగా, ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న దేవేందర్‌గౌడ్.. వారి ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేదని విశ్వసనీయ సమాచారం. -
అహంకారంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు భిన్నంగా తొలిరోజు నుంచీ కేసీఆర్ పాలన సాగిందని, అనుభవరాహిత్యం, నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని మరుగునపడేసేలా ఆయన పాలించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. అధికారం అనేది ప్రజలకు సేవచేసే అవకాశం అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయిన కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరిక వ్యవస్థలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని ఆయన విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శనివారం దేవేందర్‌గౌడ్ బహిరంగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం నూతన శకంలోకి అడుగుపెట్టే చారిత్రక సందర్భం ముందు నిలిచినా, ఆయన అహంకారంతో బంగారం లాంటి అవకాశాలను కాలదన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండానే రాష్ట్రంలో ఏటా 20శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారని దేవేందర్‌గౌడ్ లేఖలో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతా లేదని, 65 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన రాజకీయాల్ని వదిలి మిగిలిన జీవితాన్ని సార్థకత చేసుకోవాలని ఓ మిత్రునిగా సలహా ఇస్తున్నట్టు లేఖలో తెలిపారు. యువతరానికి అవకాశం ఇస్తే నూతన ఆలోచనలతో సమాజాన్ని తీర్చిదిద్దుతారని కేసీఆర్‌కు రాసిన లేఖలో దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ వీరులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆ నేతలు ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదు, నాలుగు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ బరిలో ఒక్కసారి నెగ్గడమే కొందరికి మహాకష్టం. అటువంటిది ఈ నేతలు వరుసగా మూడుసార్లు శాసనసభలో అడుగుపెట్టి తమ సత్తా చాటారు. మరికొందరు ఐదు, నాలుగుసార్లు కూడా నెగ్గి ప్రజాసేవలో తరించారు. జిల్లా పరిధిలో హ్యాట్రిక్ ఘనత ఏడుగురు నేతలకు దక్కింది. ఈ జాబితాలో వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్ అందరి కంటే ముందు ఉన్నారు. ఏకంగా వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించి రికార్డులకెక్కారు. మేడ్చల్‌లో దేవేంద్రుడు టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్ మూడు వరుస విజయాలు నమోదు చేశారు. మేడ్చల్ సెగ్మెంట్ నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ఈ స్థానం నుంచి మూడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగలేదు. 1962 మినహా 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1985లో టీడీపీ ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జి.సంజీవరెడ్డిపై కె.సురేంద్రరెడ్డి విజయం సాధించారు. ఈ తదుపరి నుంచి మూ డుసార్లు దేవేందర్‌గౌడ్ నెగ్గారు. ఆయన 2008లో టీడీపీని వీడారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ)ని స్థాపించారు. అనతి కాలంలోనే ఎన్టీపీని.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఈ పార్టీ గుర్తుపై ఒకేసారి మ ల్కాజిగిరి పార్లమెంట్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. లక్ష్మీనరసయ్యది తొలి హ్యాట్రిక్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత ఎంఎన్ లక్ష్మీనరసయ్య హ్యాట్రిక్ సాధించారు. 1957 నుంచి 1967 ఎన్నిక వరకు ఆయనకు తిరుగులేదు. వరుసగా మూడుసార్లు భారీమెజార్టీతో విజయం సాధించారు. 1957లో పీడీఎఫ్ అభ్యర్థిపై నె గ్గారు. ఆ తర్వాత 1962, 1967 లో స్వతంత్ర అభ్యర్థులు కేపీ.రెడ్డి, డి.మోహన్‌రెడ్డిపై గెలిచా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగాహ్యాట్రిక్ విజయం నమోదు చేసింది ఈయనే. విజ‘ఇంద్రుడు’ చేవేళ్ల నియోజవర్గం నుంచి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారు. పార్టీ మారినా వరుసగా నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1985 నుంచి 1999 వరకు విజయ పరంపర కొనసాగింది. 1983లో ఆయన తొలిసారిగా లోక్‌దళ్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 1985 నుంచి 1994 వరకు కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేసి వరుస విజయాలు సాధించారు. ఈ సమయంలో హోంశాఖతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం నెలకొనడంతో ఆ పార్టీని వీడిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎదురులేని హరీశ్వర్‌రెడ్డి.. కె.హరీశ్వర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించారు. ఆ సెగ్మెంట్లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీ అభ్యర్థి గెలుపొందడం హరీశ్వర్ రెడ్డితోనే మొదలైంది. 1994 నుంచి 2009 వరకు వరుస విజయాలు నమోదు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కమతం రామిరెడ్డిపైనే నెగ్గారు. చివరిసారిగా 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి టి.రాంమోహన్రెడ్డిపై ఘన విజయం పొందారు. అంతకుముందు 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్‌పై గెలిచారు. పరిగి నియోజకవర్గానికి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా.. ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డి విజయం సాధించడం విశేషం. మాణిక్ విజయ పరంపర.. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.మాణిక్‌రావు కూడా విజయ పరంపర సాగించారు. వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఈయ న సొంతం. 1969లో జరిగిన ఉప ఎన్నిక మొదలు.. 1983 ఎన్నికల వరకు ఈయనదే విజయం. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీఆర్ గాలి వీచినా ఇక్కడ మాణిక్‌రావు గెలుపును అడ్డుకోలేకపోయారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికా ర్డుల కెక్కారు. మిగిలిన మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులపై భారీమెజార్టీ సాధించారు. పీవీ నర్సింహారావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జల గం వెంగళరావు మంత్రివర్గాల్లో 14 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారు. రెం డు దఫాలుగా ఎమ్మెల్సీగా కొనసాగారు. 1969లో జరిగిన తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన మాణిక్‌రావు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. 1959లో తాండూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రవేశం చేసి న మాణిక్.. 2016లో భౌతికంగా దూరమయ్యారు. జయ‘కేతనం’ రాజకీయ దురంధరుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం ఎగురవేశారు. తొలి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండుసార్లు జనతా పార్టీ నుంచి గెలిచారు. 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 1983 ఎన్నికల వరకు క్రమం తప్పకుండా విజయాలు నమో దు చేశారు. దీంతో పాటు నాలుగుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. కేంద్ర సమాచార, సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. శేఖరుని జైత్రయాత్ర వికారాబాద్‌లో ఎ.చంద్రశేఖర్ జైత్రయాత్ర సాగించారు. ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఈయన మినహా.. మరెవరూ ఐదుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. 1985 నుంచి 2004 వరకు వికారాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడం విశేషం. 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేయడం అరుదైన విషయంగా చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీ మారిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై నెగ్గారు. ఆ తర్వాత తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లోనూ పోటీచేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ చేతిలో ఓటమిని చవిచూశారు. -
జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి
సీఎంకు దేవేందర్‌గౌడ్ లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాలని రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొత్త జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశం కావడానికి సరైన వసతుల్లేవ న్నారు. పన్నుల ద్వారా సమకూరే ప్రజల సొమ్ము వారికే చెందాలని, ప్రజాదనం ప్రజల అవసరాలకే వినియోగించాలని కోరారు. అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలను పెంచి, ఉద్యోగులను భర్తీ చేయాలని దేవేందర్‌గౌడ్ కోరారు. -
చట్టసభల ప్రసంగాలు విలువైనవి
హైదరాబాద్: చట్టసభల ప్రసంగాలు ఎంతో విలువైనవని, ప్రగతి సాధించడానికీ, క్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుగొనడానికీ ఇవి సరైన వేదికలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సోమవారమిక్కడ ఎంపీ టి.దేవేందర్ గౌడ్ శాసనసభ ప్రసంగాల పుస్తకాల (2004-2009) ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోశయ్య పుస్తకాలను (పార్ట్ 1, పార్ట్ 2)ఆవిష్కరించి ప్రసంగించారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేసే ప్రసంగాలు ప్రతి ఏటా రికార్డు అవుతాయని, చట్టసభల్లోని గ్రంథాలయంలో ప్రజాప్రతినిధులు చేసిన ప్రసంగాలు లభ్యమవుతాయని చెప్పారు. గ్రంథాలయాలకు వెళ్లి పాత ప్రసంగాలు తిరగేసే వాళ్లలో తానూ ఒకడినని చెప్పారు. ఒకప్పుడు గ్రంథాలయానికి హేమాహేమీలు వచ్చేవారని, కుర్చీ లభించకుంటే ఖాళీ అయ్యే వరకు అక్కడే వేచి ఉండేవాళ్లమని అన్నారు. శాసనసభలో గ్రంథాలయం ఎప్పుడూ అంత బిజీగా ఉండేదని, నేడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. శాసనసభ ప్రసంగాల్లో ఎక్కడా తొందరపాటు లేకుండా విషయానికి ప్రాధాన్యత ఇస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ దేవేందర్ గౌడ్ సమర్థవంతమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. టీడీపీలో అగ్రశ్రేణి నాయకుడిగా దేవేందర్ గౌడ్ ఉంటే, తాను కాంగ్రెస్‌లో చురుకైన ప్రజాప్రతినిధిగా ఉండేవాడినని గుర్తు చేశారు. ఇద్దరం శాసనసభకు హాజరయ్యే వారిమని, తమలో వ్యక్తిగత స్పర్థలు ఉండేవి కావన్నారు. సభ వేడివేడిగా జరుగుతున్నప్పటికీ బయటకు వస్తే మిత్రులుగానే ఉండేవారమని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, ఫలవంతమైన నిర్ణయాలు జరగాలని అప్పుడే సభ ఔన్నత్యం మరింత ద్విగుణీకృతం అవుతుందన్నారు. దేవేందర్ గౌడ్ ప్రసంగాలు ఈతరం వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో తాను పసిగుడ్డు అని చెప్పారు. ప్రజాప్రతినిధుల్లో దూరదృష్టి ఉండాలని ఏపీ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఓబీసీలకు ప్రత్యేకశాఖ ప్రతిపాదన లేదు
* దేవేందర్‌గౌడ్‌కు కేంద్రమంత్రి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, ఓబీసీలకు ప్రత్యేక విభాగం ఏదీ లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక శాఖమంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గత పార్లమెంట్ సమావేశాల సం దర్భంగా టీడీపీ ఎంపీ టి దేవేందర్‌గౌడ్ స్పెషల్ మెన్షన్ కింద ఓబీసీలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానాలు పంపించారు. సామాజిక ఆర్థిక కుల గణనకు సంబంధించిన వివరాలు కేంద్ర హోంశాఖకు చెందిన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) నుంచి రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్ మినహా అన్ని రాష్ట్రాల సమాచార ధృవీకరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓబీసీల ఉపవర్గీకరణ విషయంలో సూ చ నలు, సలహాలు ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) అన్నిరాష్ట్రాలను కోరినట్టు తెలిపారు. ఎన్సీబీసీ రాజ్యాంగ హోదాకల్పన ప్ర తి పాదన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. -
మల్కాజిగిరి ఎంపీ రేసులో దేవేందర్ గౌడ్ తనయుడు?
హైదరాబాద్: దేశంలోన అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి టీడీపీ లోకసభ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్‌కు ఎంపీ టికెట్ కేటాయించినట్లు సమాచారం. బీజేపీతో పొత్తులో భాగంగా ఉప్పల్ టికెట్‌ను టీడీపీ వదులుకుంది. అయితే టికెట్ పై ఆశలు పెంచుకుని నిరాశపడిన వీరేంద్రగౌడ్ కు మల్కాజ్గిరి ఎంపీ సీటును ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే మల్కాజిగిరి టికెట్ ను ఆశిస్తున్న మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి లు టికెట్ ఆశిస్తున్నట్టు చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరేంద్రగౌడ్ కు టికెట్ దక్కుతుందా లేక రేవంత్ రెడ్డి, మల్లారెడ్డిలు తమ పంతం నెగ్గించకుంటారా అనే అంశం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే మల్కాజిగిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వర్, లోకసతా అధినేత జయప్రకాశ్ నారాయణ్ రంగంలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇటీవలే ఆపార్టీ లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఖరారు కావాల్సిఉంది. -
టీడీపీలో మొదలైన టికెట్ల లొల్లి
* పొత్తుకు వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు * కొత్త వారికి సీటిస్తే ఒప్పుకోం * ఖైరతాబాద్, ఉప్పల్ సీట్ల కోసంబాబు ఇంటి వద్ద ఆందోళన * మల్కాజ్గిరి లోక్‌సభకు నేడు రేవంత్ నామినేషన్ సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు తెలుగుదేశాన్ని నట్టేట ముంచుతోంది. పొత్తు వల్ల సీట్లు కోల్పోయిన నేతలు, మైనారిటీలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఎన్నికలకు ముందు డబ్బుతో వచ్చిన వారికి సీట్లు ఇచ్చే పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి లోక్‌సభ సీటును ఇటీవలే పార్టీలో చేరిన విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డికి ఇవ్వాలని యత్నిస్తున్న చంద్రబాబుపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడుతున్నారు. తనకు ఇవ్వకూడదనుకుంటే, పార్టీలో ఎవరికిచ్చినా సంతోషిస్తామని, కొత్తగా వచ్చిన వారికిస్తే ఒప్పుకునేది లేదని ఆయన చెపుతున్నారు. అందుకే మంగళవారం మల్కాజ్గిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ చేసి బాబుపై ఒత్తిడి తేవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కేవీఆర్, దేవేందర్‌గౌడ్‌లను వదిలించుకోవడానికేనా? ఖైరతాబాద్ సీటును బీజేపీకి ఇవ్వవద్దని, కె.విజయ రామారావుకు ఇవ్వాలని, ఉప్పల్‌సీటును దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌కు ఇవ్వాలని వారిద్దరి అనుయాయులు సోమవారం బాబు నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దేవేందర్, కేవీఆర్‌లపై కోపంతోనే చంద్రబాబు ఖైరతాబాద్,ఉప్పల్ సీట్లను బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన కేవీఆర్ అనుభవాన్ని,పరిచయాలను ఉపయోగించుకొని తనపై కేసులు లేకుండా చూసుకొని ఇప్పుడు దూరం పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ హోంమంత్రి టి. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మూడేళ్లుగా ఉప్పల్ సీటును ఆశిస్తుంటే బీజేపీకి వదిలేయడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. పాతబస్తీ నుంచి టికెట్ ఆశించిన మరో నేత పార్టీ మారి టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుధవారం ఆయన రెబల్‌గా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఐక్యతతోనే రాజ్యాధికారం: డి.శ్రీనివాస్
బీసీల రాష్ట్ర స్థాయి సదస్సులో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్టీలకతీతంగా సంఘటితం కావాలి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి: దేవేందర్‌గౌడ్ జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల్లో పూర్తిస్థాయి ఐక్యత వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ వ్యక్తి పార్టీలకతీతంగా సంఘటితం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జూబ్లీహాల్లో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరిగింది. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో డీఎస్ మాట్లాడుతూ.. బీసీలలో చైతన్యం బాగా పెరిగిందని, హక్కుల సాధన కోసం సీఎంలను కూడా నిలదీసే స్థాయికి ఎదిగారని అన్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ ఏకమై రాజ్యాధికారం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు సబ్‌ప్లాన్ తప్పక సాధించి తీరుతామని, కృష్ణయ్య చేస్తున్న పోరాటం ఫలించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బీసీలు సాధించాల్సింది చాలా ఉందని, ఇందుకు ప్రతి బీసీ వ్యక్తి సైనికుడిలా పనిచేయాలని కోరారు. మరో మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బీసీలు ఏ వర్గానికీ తీసిపోరని, ఎవరికంటే బలహీనులు కారని చెప్పారు. త్వరలోనే బీసీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కాకుండా స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. బీసీలకు రాయితీలివ్వాలని ప్రభుత్వాలను అడగడం సిగ్గుగా ఉందని, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని టీడీపీ ఎంపీ దేవేందర్‌గౌడ్ అన్నారు. ఈ దేశం ఎవరి జాగీరు కాదని, ఉత్పత్తిని సృష్టించే కులాలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. సదస్సులో ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని, దశాబ్దాలుగా అధికార స్థానాలపై తిష్టవేసిన వారిని సాగనంపాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా బీసీల కోసం ఉద్యమిస్తున్న కృష్ణయ్యను పార్లమెంటుకు పంపాలన్నారు. జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలు లేని పార్టీలు దేశంలో లేవని, 2014 ఎన్నికలను బీసీలే శాసించాలని ఆకాంక్షించారు. తమ పార్టీ తరఫున బీసీ అయిన మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించామని చెప్పారు. ఈ సదస్సులో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పలు బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ శక్తిగా బీసీ ఉద్యమం: ఆర్.కృష్ణయ్య దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న బీసీ ఉద్యమాన్ని త్వరలోనే రాజకీయ శక్తిగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల రాష్ట్రస్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మార్చేందుకు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభనే వేదికగా చేసుకుంటామని చెప్పారు. దొరల రాజ్యం కూలిపోయి బడుగుల రాజ్యం వచ్చేరోజు తొందర్లోనే ఉందన్నారు. వచ్చేది బీసీల రాజ్యమేనని, ఆ దిశలో తగిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించని రాజకీయ పార్టీలను రాబోయే ఎన్నికల్లో పాతరేస్తామని చెప్పారు. అన్ని బిల్లులు తెస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సదస్సు తీర్మానాలివే.. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు తేవాలి. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి. జనాభా ప్రాతిపదికన 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ విధాన నిర్ణయం తీసుకోవాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణచేయాలి. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీల బడ్జెట్‌ను రూ.20వేల కోట్లకు పెంచాలి.