* పొత్తుకు వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
* కొత్త వారికి సీటిస్తే ఒప్పుకోం
* ఖైరతాబాద్, ఉప్పల్ సీట్ల కోసంబాబు ఇంటి వద్ద ఆందోళన
* మల్కాజ్‌గిరి లోక్‌సభకు నేడు రేవంత్ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు తెలుగుదేశాన్ని నట్టేట ముంచుతోంది. పొత్తు వల్ల సీట్లు కోల్పోయిన నేతలు, మైనారిటీలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఎన్నికలకు ముందు డబ్బుతో వచ్చిన వారికి సీట్లు ఇచ్చే పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటును ఇటీవలే పార్టీలో చేరిన విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డికి ఇవ్వాలని యత్నిస్తున్న చంద్రబాబుపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడుతున్నారు. తనకు ఇవ్వకూడదనుకుంటే, పార్టీలో ఎవరికిచ్చినా సంతోషిస్తామని, కొత్తగా వచ్చిన వారికిస్తే ఒప్పుకునేది లేదని ఆయన చెపుతున్నారు. అందుకే మంగళవారం మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ చేసి బాబుపై ఒత్తిడి తేవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కేవీఆర్, దేవేందర్‌గౌడ్‌లను వదిలించుకోవడానికేనా?
ఖైరతాబాద్ సీటును బీజేపీకి ఇవ్వవద్దని, కె.విజయ రామారావుకు ఇవ్వాలని, ఉప్పల్‌సీటును దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌కు ఇవ్వాలని వారిద్దరి అనుయాయులు సోమవారం బాబు నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దేవేందర్, కేవీఆర్‌లపై కోపంతోనే చంద్రబాబు ఖైరతాబాద్,ఉప్పల్ సీట్లను బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన కేవీఆర్ అనుభవాన్ని,పరిచయాలను ఉపయోగించుకొని తనపై కేసులు లేకుండా చూసుకొని ఇప్పుడు దూరం పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మాజీ హోంమంత్రి టి. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మూడేళ్లుగా ఉప్పల్ సీటును ఆశిస్తుంటే బీజేపీకి వదిలేయడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. పాతబస్తీ నుంచి టికెట్ ఆశించిన మరో నేత పార్టీ మారి టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుధవారం ఆయన రెబల్‌గా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
టీడీపీలో మొదలైన టికెట్ల లొల్లి
Published Tue, Apr 8 2014 12:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement