Tamil Nadu Governor Rosaiah
-
రోశయ్యను కలిసిన ధర్మాన
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ఆర్అండ్బీ వసతి గృహంలో గౌరవపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిల్లాకు రావడంపై ధర్మాన సంతోషం వ్యక్తం చేశారు. రోశయ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ఆయన మం త్రి వర్గంలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరూ క్షేమ సమాచారాలు తెలియజేసుకున్నారు. అలాగే రోశయ్యను శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గౌరవ పూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రోశయ్య ను దుశ్శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో వాసవీ చైర్మన్ మండవల్లి రవి, పేర్ల రాంబాబు, మకటపల్లి నానాజీ, పేర్ల నర్సింగరావు, పేర్ల సురేష్, పేర్ల సాంబమూర్తి, కృష్ణారావు, నరేష్, సంతోష్, రమేష్ తదితరులు ఉన్నారు. -
చట్టసభల ప్రసంగాలు విలువైనవి
హైదరాబాద్: చట్టసభల ప్రసంగాలు ఎంతో విలువైనవని, ప్రగతి సాధించడానికీ, క్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుగొనడానికీ ఇవి సరైన వేదికలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సోమవారమిక్కడ ఎంపీ టి.దేవేందర్ గౌడ్ శాసనసభ ప్రసంగాల పుస్తకాల (2004-2009) ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోశయ్య పుస్తకాలను (పార్ట్ 1, పార్ట్ 2)ఆవిష్కరించి ప్రసంగించారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేసే ప్రసంగాలు ప్రతి ఏటా రికార్డు అవుతాయని, చట్టసభల్లోని గ్రంథాలయంలో ప్రజాప్రతినిధులు చేసిన ప్రసంగాలు లభ్యమవుతాయని చెప్పారు. గ్రంథాలయాలకు వెళ్లి పాత ప్రసంగాలు తిరగేసే వాళ్లలో తానూ ఒకడినని చెప్పారు. ఒకప్పుడు గ్రంథాలయానికి హేమాహేమీలు వచ్చేవారని, కుర్చీ లభించకుంటే ఖాళీ అయ్యే వరకు అక్కడే వేచి ఉండేవాళ్లమని అన్నారు. శాసనసభలో గ్రంథాలయం ఎప్పుడూ అంత బిజీగా ఉండేదని, నేడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. శాసనసభ ప్రసంగాల్లో ఎక్కడా తొందరపాటు లేకుండా విషయానికి ప్రాధాన్యత ఇస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ దేవేందర్ గౌడ్ సమర్థవంతమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. టీడీపీలో అగ్రశ్రేణి నాయకుడిగా దేవేందర్ గౌడ్ ఉంటే, తాను కాంగ్రెస్‌లో చురుకైన ప్రజాప్రతినిధిగా ఉండేవాడినని గుర్తు చేశారు. ఇద్దరం శాసనసభకు హాజరయ్యే వారిమని, తమలో వ్యక్తిగత స్పర్థలు ఉండేవి కావన్నారు. సభ వేడివేడిగా జరుగుతున్నప్పటికీ బయటకు వస్తే మిత్రులుగానే ఉండేవారమని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, ఫలవంతమైన నిర్ణయాలు జరగాలని అప్పుడే సభ ఔన్నత్యం మరింత ద్విగుణీకృతం అవుతుందన్నారు. దేవేందర్ గౌడ్ ప్రసంగాలు ఈతరం వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో తాను పసిగుడ్డు అని చెప్పారు. ప్రజాప్రతినిధుల్లో దూరదృష్టి ఉండాలని ఏపీ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా పాఠాలే పెద్ద బాలశిక్ష
తమిళనాడు గవర్నర్ రోశయ్య తెనాలి : ఆచార్య ఎన్జీ రంగా పాఠాలే రాజకీయంగా తనకు పెద్ద బాలశిక్ష అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చెప్పారు. ప్రఖ్యాత పార్లమెంటేరియన్, రైతునాయకుడు ఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును ఆదివారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సభలో కొణిజేటి రోశయ్యకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతుల మీదుగా బహూకరించారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ట్రస్ట్ నిర్వాహకురాలు, శాసనమండలి మాజీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి స్వాగతం పలికారు. రోశయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో తన వాక్పటిమ రంగా రాజకీయ పాఠశాలలో అలవడిందేగానీ, ఏ పండితుల శిక్షణలోనూ అభ్యాసం చేసింది కాదన్నారు. అందరూ ఆపాదిస్తున్న ఘనతకు తాను అర్హుడిని కాదని చెబుతూ, రంగాగారు, నాకు మార్గదర్శకులైన పెద్దలకే ఆ ఔన్నత్యం దక్కాలన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని కాపాడిన రోశయ్య నుంచి, రాష్ట్ర శాసనమండలి కార్యక్రమాల పద్ధతి, పాటించాల్సిన సంప్రదాయాలను అలవరచుకొన్నట్టు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ నిర్మాత ఎన్జీ రంగా సాహసోపేతమైన నేతగా చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పొన్నూరు చైర్పర్సన్ సజ్జా హైమావతి, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు. స్వాతంత్య్రయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధిపతి అన్నాబత్తుని శివకుమార్, జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, మాణిక్యవేల్, ట్రస్ట్ ప్రతినిధులు కొసరాజు వెంకట్రాయుడు, ఆలపాటి మాధవరావు, జెట్టి అంకినీడు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. -
గవర్నర్ చేతుల మీదుగా సాలై యోరం ఆడియో
సాలైయోరం చిత్ర ఆడియోను రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఫోటాన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పణలో స్మైలీ పిక్చర్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత మురుగన్ సుబ్బరాయన్ నిర్మిస్తున్న చిత్రం సాలై యోరం. డాక్టరు సెల్వ తంగరాజన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కె.మూర్తికన్నన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కొత్త నటుడు రాజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఎస్.సేతురామన్ సంగీతం అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉద యం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య చేతుల మీదుగా జరి గింది. ఆడియో తొలి సీడీని దర్శకుడు పీ.వాసు, ట్రైలర్ సీడీని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటుడు పాండియరాజ్, నిర్మాత అశోక్ లోదా, తెలుగు ప్రముఖులు తెలుగు తెర అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ సాలైయోరం చక్కని సందేశంతో కూడిన చిత్రమన్నారు. ఇలాంటి వాటిని ఆదరిస్తే ముందు ముందు మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.