ఆ ‘శుక్రవారం’ ఎప్పుడొచ్చేనో..! | libia kidnapers story | Sakshi
Sakshi News home page

ఆ ‘శుక్రవారం’ ఎప్పుడొచ్చేనో..!

Published Sat, Aug 29 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

ఆ ‘శుక్రవారం’ ఎప్పుడొచ్చేనో..!

ఆ ‘శుక్రవారం’ ఎప్పుడొచ్చేనో..!

నెల క్రితం లిబియాలో ప్రొఫెసర్ల కిడ్నాప్
వారి విడుదలపై ఇంకా తొలగని ప్రతిష్టంభన
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ప్రతీ శుక్రవారం ఎదురు చూపులు
 
హైదరాబాద్: శుక్రవారం రాగానే ఆ రెండు కుటుంబాల్లో ఎన్నో ఆశలు.. తమ ఇంటి పెద్ద వస్తారని... కుటుంబంలో వెలుగులు నింపుతారని.. కానీ, శుక్రవారాలు వస్తూనే ఉన్నాయి.. వారు మాత్రం రావడం లేదు.. కనీసం ఆచూకీ కూడా తెలియడం లేదు.. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్.. లిబియాలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను అపహరించిన విషయం తెలిసిందే.. నెల రోజులు దాటినా ఇప్పటికీ వారు విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.  సరిగ్గా  నెల రోజుల కిందట.. జూలై 29న... లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తెలుగువారు బలరామ్ కిషన్, టి.గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లు ఇండియాకు రావడానికి బయలుదేరారు. ప్రతి ఏడాది వీరు జూలైలో వచ్చి సెప్టెంబర్‌లో తిరిగి అక్కడికి వెళ్తారు.

ఈ సారి కూడా అలాగే బయలుదేరారు. అయితే, లిబియా నుంచి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పొరుగు దేశం ట్యునీషియా నుంచి భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సిర్త్ నుంచి  కారులో బయలుదేరారు. మార్గం మధ్యలోనే ఐఎస్‌ఐఎ స్ ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లను వదిలేశారు. కానీ, తెలుగు ప్రొఫెసర్లు బలరా మ్ కిషన్, గోపీకృష్ణలను తమ వద్దే బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారి విడుదలకు ఆ రెండు కుటుంబాలు కంటి మీద కును కు లేకుండా ఎదురు చూస్తున్నాయి. కానీ, ప్రొ ఫెసర్ల విడుదలపై ప్రభుత్వ ప్రయత్నాలు ఇంకా  కొలిక్కి రాలేదు. భారత రాయబార కార్యాలయం నుంచి వారు ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం మాత్రం అందుతోంది. కానీ విడుదలపై ఎలాంటి పురోగతి లేదు.  
 
ఆందోళనలో కుటుంబాలు..
హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ బలరామ్ కిషన్ లిబియాలోని సిర్త్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్. ఆయన భార్య శ్రీదేవి నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక నాచారానికి చెందిన టి.గోపీకృష్ణ కూడా ఇదే వర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. భార్య కల్యాణి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. కిడ్నాప్ వార్త తెలిసినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడిపోయాయి. లిబియాలోని భారత రాయబార కార్యాలయం నుంచి  ‘వారు బాగున్నారు. త్వరలోనే విడుదలవుతారు’.. అని వచ్చే సందేశాలే ఆ కుంటుంబాలకు ధైర్యాన్ని ఇస్తున్నాయి.
 
నాన్న ఎప్పుడొస్తారని అడుగుతున్నారు..
ప్రతి రోజు నాన్న ఎప్పుడొస్తారు అని పిల్లలు అడుగుతున్నారు. వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి. ప్రతి క్షణం భయంతో బతుకుతున్నాం. ఏ దేవుడికీ మా పైన దయ కలగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ జీవితంపై విరక్తి కలుగుతోంది. ప్రభుత్వం మా బాధలను పట్టించుకోవడం లేదు.  -  గోపీకృష్ణ భార్య కల్యాణి  
 
ధైర్యం కోల్పోతున్నాం..
పవిత్రమైన శుక్రవారం రోజు ఉగ్రవాదులు మా వారిని విడుదల చేస్తారేమోననే ఆశతో నాలుగు వారాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏ ఫోన్ కాల్ వ చ్చినా  శుభవార్త తెలుస్తుందేమోననే ఆశ. ప్రతి గుడికి వెళ్తున్నాం. మొక్కని దేవుడు లేడు. వాళ్లు బాగానే ఉన్నారు అని ప్రభుత్వం చెబుతుంది. కానీ నెల రోజులైనా ఎందుకు విడుదల కావడం లేదు. చర్చలు ఏ దశలో ఉన్నాయో తెలియడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ధైర్యం కోల్పోతున్నాం.     - బలరామ్ భార్య శ్రీదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement