'లండన్' తరహాలో 'హైదరాబాద్ పాస్' | ' London ' style to 'Hyderabad ' | Sakshi
Sakshi News home page

'లండన్' తరహాలో 'హైదరాబాద్ పాస్'

Published Sun, Dec 27 2015 11:03 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

'లండన్' తరహాలో 'హైదరాబాద్ పాస్' - Sakshi

'లండన్' తరహాలో 'హైదరాబాద్ పాస్'

లండన్ పాస్.. ప్రపంచ పర్యాటకులకు సుపరిచితమైన పేరు. లండన్‌లో కాలుమోపిన విదేశీ పర్యాటకులకు అక్కడి అధికారులు తక్కువ ధరకు అందించే స్మార్ట్‌కార్డ్ ఇదీ. లండన్ నగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎక్కడా సందర్శన టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా, క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా నేరుగా లోనికి వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది.
 

ఇప్పుడు ఇదే తరహాలో 'హైదరాబాద్ పాస్'ను అందుబాటులోకి తేవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా హైదరాబాద్ పాస్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. పర్యాటక స్థలాలలతోపాటు హోటల్ గదులు, విమాన, రైలు టికె ట్లు కూడా ప్రత్యేకంగా కొనకుండా దీని ద్వారానే పొందేలా ఈ ‘పాస్’కు రూపకల్పన చేయబోతోంది.
 
 తక్కువ ధరకే..
భాగ్యనగరానికి వచ్చే టూరిస్టులకు పర్యాటక శాఖ పక్షాన 'హైదారబాద్ పాస్'ను అందజేస్తారు. ఆ పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు, నగరంలో ఉండే రోజులు.. తదితరాల ఆధారంగా దీని ధరలను నిర్ధారిస్తారు. విడివిడిగా ఆయా సేవలు పొందేందుకు చెల్లించే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఈ పాసులు అందుబాటులో ఉంటాయి.

దాన్ని కొన్న పర్యాటకుడు మరెక్కడా ఏ తరహా టికెట్ కొనాల్సిన పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. ఎంట్రెన్స్ టికెట్లు, ప్రయాణ టికెట్ల రుసుమును అందులోనే చేరుస్తారు. ఆ పాస్‌ను హోటళ్లు, ఎయిర్‌లైన్స్, పర్యాటక ప్రాంతాలతో అనుసంధానిస్తారు. ఇందుకోసం పర్యాటక శాఖ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో 5 శాతం గదులను తన పేరిట రిజర్వ్ చేస్తుంది. అలాగే విమాన టికెట్లను కూడా నిర్ధారిత సంఖ్యలో రిజర్వ్ చేసుకుని ఉంచుతుంది. వాటి నిర్వాహకులతో చర్చించి అతి తక్కువ ధరకు పొందుతుంది.
 

వాటిని హైదరాబాద్ పాస్‌తో అనుసంధానించి రాయితీ ధరకు పర్యాటకులకు అందజేస్తుంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హోటళ్ల నిర్వాహకులు, విమానయాన సంస్థలు, రైల్వేతో కలసి పనిచేస్తుంది. ఇది విదేశీ, స్వదీశీ పర్యాటకులకు వర్తిస్తుంది. పాస్ నాలుగైదు రకాలుగా ఉంటుంది. నమూనా ఆధారంగా ధర కూడా విడివిడిగా ఉంటుంది.
 
విదేశీ పర్యాటకులకు 'ప్రత్యేక హోదా'
రాష్ట్ర పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులకు ప్రత్యేక అతిథి హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు ప్రయాణించే కారుపై ప్రత్యేక సింబల్ ఏర్పాటు, వారు రాగానే హోటల్ సిబ్బంది తెలంగాణ సంప్రదాయ రీతిలో స్వాగతం పలకటం, షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తే రాయితీ ధరలకు వస్తువులు ఇవ్వటం.. తదితరాలు ఇందులో భాగం. విదేశాల్లో ఉంటున్న తెలంగాణవారు తెలంగాణ పర్యాటకానికి సాయపడే మరో అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

విదేశీయుల్లో అవగాహన తెచ్చి తెలంగాణలో పర్యటించేలా చేస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని భావిస్తోంది. ఇంతమంది పర్యాటకులను పంపితే ఇంత మొత్తం అని నిర్ధారిస్తారు. ఆ ప్రోత్సాహకాన్ని నగదు రూపంలో కాకుండా ప్రత్యేక సేవ(ఉచితం)గా అందిస్తారు. కావాలంటే వారి సొంత గ్రామాల కు ప్రయోజనం కలిగించే ఏర్పాట్లు కూడా చేస్తారు. వారిని ప్రవాస భారత రాయబారులుగా పరిగణిస్తారు.
 
 2020 నాటికి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం
 ప్రస్తుతం తెలంగాణకు వచ్చే వార్షిక పర్యాటకుల సంఖ్య లక్ష లోపే. దాన్ని 2020 నాటికి 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 నాటకి 3 లక్షలు, 2018 నాటికి 5 లక్షలకు పెంచి తుదకు లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రణాళిక. అందులో భాగంగానే ఈ కొత్త ప్రణాళికలపై దృష్టి సారించినట్టు పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం 'సాక్షి'తో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement