హైదరాబాద్: ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అక్టోబరులో నూతన బార్లకు నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ విధానంలోనే అప్పగించేందుకు ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో నూతన బార్లకు లైసెన్సు ఫీజు చెల్లించాలని అబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది జూలై నుంచి నెల నెలా బార్ల లెసైన్సుల రెన్యువల్‌తోనే ఎక్సైజ్ శాఖ నెట్టుకొస్తుంది. రాష్ట్రంలో 771 బార్లకు కొత్త పాలసీ ప్రకటించేందుకు గతేడాది జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పాలసీలో పలు లోపాలు వెలుగు చూడటంతో పాటు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండటంతో కొందరు మద్యం వ్యాపారులు కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత తనయుడు రెండు నియోజకవర్గాల్లో కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునేవారంతా తనకు ముడుపులు చెల్లించాలని ఒత్తిళ్లు చేయడం, మాట వినని మద్యం వ్యాపారులపై మున్సిపాలిటీ అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టటంతో వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రభుత్వ పాలసీని తప్పు పట్టింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పాలసీ రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ సవరణ జీవోలు జారీ చేసింది. తాజాగా బార్ల పాలసీకి బూజు దులిపి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలందడంతో లాటరీ విధానమైతేనే మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
ఏపీలో వచ్చే నెలలో బార్ల వేలం
Published Sat, Sep 10 2016 3:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
Advertisement