Lottery System
-
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ -
హెచ్1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1–2022 సెప్టెంబర్ 30) హెచ్–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. -
లాటరీ విధానంలోనే హెచ్1బీ వీసా
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్–1బీ వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని బైడెన్ సర్కార్ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. హెచ్–1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో çకంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ కొత్త విధానం అమలును మార్చి 9 నుంచి డిసెంబర్ 31కి వాయిదా వేసినట్టుగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరించింది. ప్రతిభ ఆధారిత వీసాలు..! వలసేతర వీసా అయిన హెచ్–1బీ కింద అమెరికా ఏటా 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. వర్సిటీల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసాలున్న విదేశీయులకు తక్కువవేతనం చెల్లిస్తూ పలు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న భావన నెలకొంది. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌తో యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుభవార్త అందించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాలు రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురానున్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని బైడెన్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతోపాటు, ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పరిశీలనకు కమిటీలకు పంపించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల లాటరీ విధానానికి బైడెన్ స్వస్తి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్1బీ వీసా జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పి వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌లలో..పీహెచ్డీ చేసిన వారికి గ్రీన్‌కార్డు ఇచ్చే యోచనలో కూడా బైడెన్ ఉన్నారు. జనవరి 20 న పదవీ స్వీకారం తరువాత ఏం చేస్తారన్న ప్రశ్నలకు బైడెన్ స్పందించారు. అలాగే కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను అర్థిస్తానని కూడా బైడెన్ తెలిపారు. అధ్యక్ష పదవినిచేపట్టిన మొదటి రోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతామని కూడా బైడెన్ తెలిపారు. కాగా ట్రంప్ తీసుకొచ్చిన "క్రూరమైన" ఇమ్మిగ్రేషన్ విధానాలను రద్దుచేస్తామనేది బైడెన్ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. (అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం) -
హెచ్–1బీ వీసాల్లో లాటరీలకు స్వస్తి!
వాషింగ్టన్: వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియలో మార్పులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. కంప్యూటర్ లాటరీ విధానానికి స్వస్తిచెప్పే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించనున్నారు. వీసాల ప్రక్రియలో ఈ మార్పు చేయడం వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. కొత్త విధానంపై గురువారం ఫెడరల్ రిజస్టర్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ (డీహెచ్ఎస్)కు నెల రోజుల్లోపు తెలియజేయవచ్చు. లాటరీ స్థానంలో వేతనాల ఆధారంగా వీసాల జారీని ప్రారంభిస్తే ఆయా రంగాల్లోని ఉద్యోగులకు ఇచ్చే అత్యధిక వేతనాన్ని, అదే రంగంలో పనిచేసేందుకు వచ్చే విదేశీ వృత్తినిపుణుడికి కంపెనీ ప్రతిపాదించిన వేతనాన్ని పోల్చి చూస్తారు. ఈ పద్ధతి వల్ల అటు అమెరికన్ ఉద్యోగులకు, ఇటు హెచ్1బీ వీసాదారులకూ సమన్యాయం జరుగుతుందని డీహెచ్ఎస్ తెలిపింది. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించేందుకు లేదా అత్యధిక వృత్తి నైపుణ్యాలు ఉన్న వారి కోసం దరఖాస్తు చేసేందుకు వీలు కల్పిస్తుందని డీహెచ్ఎస్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ కుచినెల్లీ తెలిపారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మార్పులు ఉన్నట్లు ఆయన చెప్పారు. హెచ్1–బీ వీసా వ్యవస్థ తరచూ దుర్వినియోగమవుతోందని, తక్కువ వేతనాలతో పనిచేయించుకునేందుకు కంపెనీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఆ నేపథ్యంలో ట్రంప్ వీసాల జారీ ప్రక్రియలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 22న హెచ్1–బీ, ఎల్–1 వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా వీసా వ్యవస్థను సంస్కరిస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనూ హామీ ఇచ్చారు. 2014 నుంచి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్1–బీ వీసాల నోటిఫికేషన్ జారీ అయిన తొలి ఐదు రోజుల్లోనే ఏడాది కోటాకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందుకుంటోంది. ఒక ఏడాదికి గరిష్టంగా 65000 హెచ్1–బీ వీసాలు మాత్రమే జారీ చేస్తారన్నది తెలిసిన విషయమే. -
‘హెచ్–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్
వాషింగ్టన్: భారత్ టెక్కీల డాలర్ కలలను నెరవేర్చే, అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు విధానాన్ని మార్చినట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. 2021ఏడాది హెచ్1బీ దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కంపెనీలు తాము తీసుకోబోయే ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందజేయాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లను ఫీజుగా చెల్లించాలి. ఏటా 85 వేల హెచ్–1బీ వీసాలను ఈ వీసా దరఖాస్తులు పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 85 వేల వీసాలు మంజూరు చేస్తారు. ‘ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుంది. ఐటీ కంపెనీల, ఉద్యోగుల సమాచారం ఇవ్వడం సులభతరం అవుతుంది’అని ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. 2020–21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. -
భారతీయ వర్కర్లకు ట్రంప్ గుడ్‌న్యూస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దేశీయ ఐటీ వర్కర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. వీసా లాటరీ సిస్టమ్‌కు స్వస్తి పలకాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో కొన్ని దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీగా లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నైపుణ్యవంతులైన వర్కర్లకు ఎంతో మేలు చేయనుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్ ఆమోదిస్తే, అత్యధిక నైపుణ్యం కలిగిన భారత వలసదారులకు గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను గణనీయంగా తగ్గనుంది. 'ది డైవర్సిటీ వీసా ప్రొగ్రామ్' కింద ఏడాదికి 50వేల మందికి గ్రీన్‌కార్డులను అందిస్తున్నారు. ఈ గ్రీన్‌కార్డు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస హోదా లభించనుంది. భౌగోళికపరంగా ఈ వీసాలను అందజేస్తారు. ప్రస్తుతం దేశీయ కోటా కింద వేలమంది భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డుల కోసం కొన్ని దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. 'ది డైవర్సిటీ వీసా ప్రొగ్రామ్' ప్రొగ్రామ్‌ను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో అమెరికాకు ఉత్తమమైన, ప్రతితాభవంతులైన వర్కర్లు రాలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత రోజుల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో నిందితులు డైవర్సిటీ వీసా లేదా చైనా మైగ్రేషన్‌గా గుర్తించారు. -
హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు నేడు లాటరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో ప్రవేశాలకు సంబంధించి గురువారం సాయంత్రం లాటరీ తీయనున్నట్టు రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి సురేష్ రెడ్డి తెలిపారు. బేగంపేట, రామంతపూర్‌లోని ఆ స్కూళ్లలో 2017-18 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు బాలబాలికల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లక్డీకపూల్‌లోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సాయంత్రం 5 గంటలకు లాటరీ తీయనున్నారు. దరఖాస్తులు అందజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలని అధికారులు సూచించారు. -
ఏపీలో వచ్చే నెలలో బార్ల వేలం
హైదరాబాద్: ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అక్టోబరులో నూతన బార్లకు నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ విధానంలోనే అప్పగించేందుకు ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో నూతన బార్లకు లైసెన్సు ఫీజు చెల్లించాలని అబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది జూలై నుంచి నెల నెలా బార్ల లెసైన్సుల రెన్యువల్తోనే ఎక్సైజ్ శాఖ నెట్టుకొస్తుంది. రాష్ట్రంలో 771 బార్లకు కొత్త పాలసీ ప్రకటించేందుకు గతేడాది జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పాలసీలో పలు లోపాలు వెలుగు చూడటంతో పాటు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండటంతో కొందరు మద్యం వ్యాపారులు కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత తనయుడు రెండు నియోజకవర్గాల్లో కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునేవారంతా తనకు ముడుపులు చెల్లించాలని ఒత్తిళ్లు చేయడం, మాట వినని మద్యం వ్యాపారులపై మున్సిపాలిటీ అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టటంతో వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రభుత్వ పాలసీని తప్పు పట్టింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పాలసీ రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ సవరణ జీవోలు జారీ చేసింది. తాజాగా బార్ల పాలసీకి బూజు దులిపి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలందడంతో లాటరీ విధానమైతేనే మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. -
మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం
జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం గత ఏడాది కంటే మూడు షాపులు అదనం నాలుగు కేటగిరీలుగా లెసైన్‌స ఫీజులు ఎజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు {పభుత్వ గెజిట్ ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు.మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. వరంగల్ :మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం (2014-15) ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణరుురచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూరుు. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు. లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది. ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీలో 19 షాపులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్‌లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. -
తెలంగాణ ఎంపీలు ఆంధ్రాకు.. ఆంధ్రా ఎంపీలు తెలంగాణకు!
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన లాటరీ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న ఇరు ప్రాంతాల్లోని అభ్యర్థులు.. ఇక నుంచి వేరు పడనున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపిక ప్రక్రియ అనివార్యం కావడంతో లాటరీ పద్దతిలో వీరిని ప్రాంతాల వారీగా విభజించారు. ఇందులో కొంతమంది సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ రాష్టానికి ఎంపికవ్వగా, టీ.ఎంపీలలో కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ క పదకొండు మంది, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ప్రస్తుతం ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ) మరణంతో ఇది ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. సీమాంధ్రలో ఉన్న ఇద్దరు ఎంపీలు సీఎం రమేష్, కేవీపీలను ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించగా, టి.ఎంపీలలో కేకే, ఎంఏఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఏపీకి కేటాయించారు. మిగిలిన ఎంపీలందరూ ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి పరిమితం కానున్నారు. కాగా, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ ను మాత్రం ఏపీకే కేటాయించారు. లాటరీలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన సభ్యులు.. కె.కేశవరావు(టీఆర్ఎస్) ఎం.ఎ.ఖాన్(కాంగ్రెస్) రేణుకా చౌదరి(కాంగ్రెస్) దేవేందర్ గౌడ్(టీడీపీ) సుజనా చౌదరి(టీడీపీ) సీతారామలక్ష్మి(టీడీపీ) జైరాం రమేష్(కాంగ్రెస్) టి.సుబ్బిరామిరెడ్డి(కాంగ్రెస్) జేడీ శీలం(కాంగ్రెస్) చిరంజీవి(కాంగ్రెస్) తెలంగాణకు కేటాయించిన సభ్యులు.. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) వి.హనుమంతరావు (కాంగ్రెస్) ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) పాల్వాయి గోవర్దన్ రెడ్డి (కాంగ్రెస్) సీఎం రమేశ్ (టీడీపీ) గుండు సుధారాణి (టీడీపీ) గరికిపాటి మోహన్ రావు(టీడీపీ) -
లాటరీ పద్ధతి అశాస్త్రీయం: పాల్వాయి
రాజ్యసభ సభ్యులను లాటరీ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు కేటాయించడం అశాస్త్రీయమని సీనియర్ ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి రాజ్యసభకు ఎంపికైన వారిని ఆంధ్రా, తెలంగాణ వారీగా ఉంచాలని, తాము ఇప్పటికే తమ సొంత జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నామని పాల్వాయి చెప్పారు. తమ వాదనను ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుందని, బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్డినెన్స్ చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, రాజ్యసభ సభ్యులను లాటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించడంపై పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో డ్రా వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం 4 దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.