తెలంగాణ ఎంపీలు ఆంధ్రాకు.. ఆంధ్రా ఎంపీలు తెలంగాణకు!
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన లాటరీ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న ఇరు ప్రాంతాల్లోని అభ్యర్థులు.. ఇక నుంచి వేరు పడనున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపిక ప్రక్రియ అనివార్యం కావడంతో లాటరీ పద్దతిలో వీరిని ప్రాంతాల వారీగా విభజించారు. ఇందులో కొంతమంది సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ రాష్టానికి ఎంపికవ్వగా, టీ.ఎంపీలలో కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ క పదకొండు మంది, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ప్రస్తుతం ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ) మరణంతో ఇది ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
సీమాంధ్రలో ఉన్న ఇద్దరు ఎంపీలు సీఎం రమేష్, కేవీపీలను ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించగా, టి.ఎంపీలలో కేకే, ఎంఏఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఏపీకి కేటాయించారు. మిగిలిన ఎంపీలందరూ ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి పరిమితం కానున్నారు. కాగా, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ ను మాత్రం ఏపీకే కేటాయించారు.
లాటరీలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన సభ్యులు..
కె.కేశవరావు(టీఆర్ఎస్)
ఎం.ఎ.ఖాన్(కాంగ్రెస్)
రేణుకా చౌదరి(కాంగ్రెస్)
దేవేందర్ గౌడ్(టీడీపీ)
సుజనా చౌదరి(టీడీపీ)
సీతారామలక్ష్మి(టీడీపీ)
జైరాం రమేష్(కాంగ్రెస్)
టి.సుబ్బిరామిరెడ్డి(కాంగ్రెస్)
జేడీ శీలం(కాంగ్రెస్)
చిరంజీవి(కాంగ్రెస్)
తెలంగాణకు కేటాయించిన సభ్యులు..
కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్)
వి.హనుమంతరావు (కాంగ్రెస్)
ఆనంద భాస్కర్ (కాంగ్రెస్)
పాల్వాయి గోవర్దన్ రెడ్డి (కాంగ్రెస్)
సీఎం రమేశ్ (టీడీపీ)
గుండు సుధారాణి (టీడీపీ)
గరికిపాటి మోహన్ రావు(టీడీపీ)