పెద్దల సభలో ఎవరేమన్నారంటే...
Published Fri, Feb 21 2014 2:09 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
ప్రత్యేక ప్యాకేజీలివ్వాలి: డి.రాజా, సీపీఐ
‘బిల్లుకు సీపీఐ మద్దతిస్తోంది. అంటే మేం చిన్న రాష్ట్రాలకు మద్దతిస్తున్నట్టు కాదు. విభజన శాంతి సామరస్యాలతో జరగాల్సింది. కానీ కాంగ్రెస్, కేంద్రం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజల భయాందోళనలు పోగొట్టాలి. కొత్త రాజధానికి చాలినన్ని నిధులివ్వాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి’.
సుదీర్ఘ ఉద్యమం: పాశ్వాన్, లోక్‌జనశక్తి
‘‘తెలంగాణ ఉద్యమం చాలా ఏళ్లుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సీమాంధ్రకూ న్యాయం జరగాలి’.
సమాఖ్య స్ఫూర్తికి భిన్నం: కనిమొళి
‘ఏకాభిప్రాయం రావాలని అడుగుతున్నాం. కానీ నాలుగేళ్లుగా అది జరగలేదు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విభిన్నం. మేం బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నాం’.
మేం వ్యతిరేకం: సీపీఎం నేత సీతారాం ఏచూరి
‘కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. మేం విభజన బిల్లుకు వ్యతిరేకం. దాన్ని లోక్‌సభకు తిప్పి పంపండి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. అందుకే చాలా రోజులుగా వ్యతిరేకిస్తున్నాం. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు. ఆర్థిక సాయాన్ని దేశవ్యాప్తంగా వెనకబడ్డ అన్ని ప్రాంతాలకూ ఇవ్వాలి’
పెద్ద రాష్ట్రాలను విభజించాలి: మాయావతి
‘ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలవుతుండటం చాలా సంతోషం. పదేళ్ల ఉమ్మడి రాజధానంటే సుదీర్ఘ సమయం. ఎవరికీ ఉపయోగపడదు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది చాలా వెనకబడిన ప్రాంతం. అక్కడ ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలు ఎక్కువ. అక్కడి అగ్ర వర్ణాల్లో కూడా పేదలున్నారు. కాబట్టి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వకపోతే లాభముండదు. ఆర్థిక స్థితి బాగా లేని రాష్ట్రాలన్నింటికీ స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి. పెద్ద రాష్ట్రాలన్నింటినీ విభజించాలి’
వ్యతిరేకిస్తున్నామంతే: సీఎం రమేశ్, టీడీపీ
‘ఇది మొత్తం రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు. వ్యతిరేకిస్తున్నాం. అంతే’
మా మద్దతుంది: దేవేందర్ గౌడ్, టీడీపీ
‘బిల్లుకు మేం మద్దతిస్తున్నాం. అయితే సీమాంధ్ర ప్రజల అవసరాలను తీర్చాలని కోరుతున్నా’’
ఆంక్షలొద్దు: గుండు సుధారాణి, టీడీపీ
‘మాకు ఆంక్షలు లేని తెలంగాణ కావాలి. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలి’
స్వాగతిస్తున్నాం: వై.ఎస్.చౌదరి, టీడీపీ
‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఆ విధానం పూర్తిగా అప్రజాస్వామికం. ఎన్నికల షెడ్యూలుకు 10 రోజుల ముందు విభ జిస్తారా? ఈ బిల్లు న్యాయ వ్యతిరేకం. దీన్ని స్టాండింగ్ కమిటీకి నివేదించాలి’
చండీగఢ్ ఇప్పటికీ రాలేదు: గుజ్రాల్, అకాలీదళ్
‘45 ఏళ్ల క్రితం పంజాబ్ విడిపోయింది. చండీగఢ్ ఐదేళ్లే యూటీగా ఉంటుందని, తరవాత పంజాబ్‌కు చెందుతుందని చెప్పారు. అదిప్పటికీ రాలేదు’’
బిల్లును ఎన్.కే.సింగ్ (జేడీయూ), రాంగోపాల్ యాదవ్ (సమాజ్‌వాదీ), శశిభూషన్ బెహరా (బిజూ జనతాదళ్), బీరేంద్ర ప్రసాద్ బైశ్య (అసోం గణ పరిషత్) వ్యతిరేకించారు. జనార్దన్ వాగ్మారే (ఎన్సీపీ), రాం కృపాల్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), బిశ్వజిత్ దైమారి (బీపీఎఫ్) సమర్థించారు.
కేవీపీని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలన్న డిప్యూటీ చైర్మన్
రాజ్యసభలో కొద్ది రోజులుగా రోజూ వెల్‌లో నిల్చొని, రెండు చేతులు పెకైత్తి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రారావు అనారోగ్యంతో ముందు వరసలో కింద ఒరిగిపోయారు. ఈ విషయాన్ని డిప్యూటీ చైర్మన్ గమనించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ను ‘ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లండి’ అని ఆదేశించారు. అయితే అందుకు నిరాకరించిన కేవీపీ సభ అయిపోయేవరకు అలాగే కింద కూర్చుండిపోయారు.
Advertisement
Advertisement