కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం | KVP's private member Bill to come up for debate today | Sakshi
Sakshi News home page

కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం

Published Sat, Aug 6 2016 3:24 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం - Sakshi

కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం

ద్రవ్యబిల్లుపై ఓటింగ్‌కు రాజ్యసభకు అధికారం లేదన్న జైట్లీ
నిర్ణయం కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపిన రాజ్యసభ
తానిచ్చిన హామీని గౌరవించాలన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్
వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. సభ సోమవారానికి వాయిదా    

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించాలా? లేదా? అనే విషయాన్ని తేల్చడానికి లోక్‌సభ స్పీకర్ వద్దకు బిల్లును పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు.

అప్పటివరకూ దీన్ని వాయిదా వేస్తున్నామని  ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ చేపట్టాల్సిన సమయంలో బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లుగా పేర్కొంటూ..రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమన్నారు. రాజ్యాంగంలోని అర్టికల్ 117 ను ఉటంకిస్తూ, ఆ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్నారు. ద్రవ్య బిల్లు అవునా, కాదా అనే వివాదం ఏర్పడినప్పుడు లోక్‌సభ స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర పథకాలలో 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుందని, అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలకు సంబంధించి నిధుల వినియోగం ముడిపడి ఉందన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నామని, రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ అభ్యంతరాలపై సభ్యుల అభిప్రాయాలను కురియన్ కోరారు.
 
నాటి ప్రధాని హామీల మాటేమిటి?
రాజ్యసభలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారా లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లు అవునా, కాదా అన్నది సమస్య కాదని, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను గౌరవిస్తారా లేదా? తేల్చాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14 వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆర్థిక మంత్రి జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ చెప్పారు.

ద్రవ్య బిల్లుగా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ తప్పుబట్టారు.  చర్చ ముగిసిన తర్వాత ద్రవ్య బిల్లు అనడం సరికాదని సమాజ్‌వాది పార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ చెప్పారు. జీఎస్‌టీ బిల్లును అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ చెప్పారు. ఉభయ పక్షాల వాదన విన్న తర్వాత బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపిస్తున్నట్లు కురియన్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
 
బిల్లుపై అనవసర రాద్ధాంతం: కేవీపీ
రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి అనుమతి ఉందని, చర్చ  పూర్తయిన సమయంలో ద్రవ్య బిల్లు అనడంలో అర్థం లేదని కేవీపీ విమర్శించారు. గతంలో కూడా ఈ విధమైన రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్రం హామీలను అమలు చేయకపోవడం వల్లే బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఇవ్వవచ్చన్నారు.
 
హామీలను అమలు చేయాలి
ఏపీ విభజన సమయంలో ప్రధానిగా రాజ్యసభలో తాను ఆరు హామీలు ఇచ్చానని,వాటిని అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. అప్పట్లో విపక్షంలో ఉన్న జైట్లీ  ఆ హామీలపై సంతృప్తి చెందారని, విభజన బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు.కేబినెట్‌లో తీర్మానించి, రాష్ట్రపతికి పంపించామని,  ఎన్నికల షెడ్యూల్ వల్ల ఆర్డినెన్స్ జారీ కాలేదని తెలిపారు. అప్పటి హామీలను గౌరవించి అమలు చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement