జైరాం రమేష్, కురియన్ మధ్య వాగ్వాదం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బిల్లు చర్చ ముగిసిందని కురియన్ ప్రకటించడంతో జైరాం రమేష్ అభ్యంతరం తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ అంశాలపై మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా, కేవీపీ ప్రైవేట్ బిల్లుపైనే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ సూచించారు. పునర్ వ్యవస్థీకరణపై బిల్లుపై ఇప్పటికే చాలాసార్లు చర్చించామన్నారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లా కాదా అన్నదానిపైనే ప్రస్తుతం చర్చ అని కురియన్ పేర్కొన్నారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ జైరాం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తరువాత మాట్లాడిన కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్ విభజన హామీలు నెరవేర్చాలని..మనీ బిల్లు అనడం సమంజసం కాదన్నారు. అయితే కేవీపీ బిల్లు మనీబిల్లా కాదా అనేది లోక్‌సభ స్పీకర్‌ను అడుగుతామంటూ కురియన్ మరో చర్చలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది.
అంతకు ముందు కపిల్ సిబల్ మాట్లాడుతూ దేశ చట్టసభల్లో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క బిల్లు ద్రవ్య బిల్లేనన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణిస్తూ...ఓటింగ్ జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కపిల్ సిబల్ విమర్శించారు.
అలాగే ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు..... విలువుందో లేదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని సీపీఐ ఎంపీ సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి సంబంధించి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏచూరి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కాగా ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా కేంద్రం పరిగణించడం సరికాదని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ బిల్లు ప్రతి ఒక్క సభ్యుడి హక్కు అని తెలిపారు. ఆనాడు పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నామని, ప్రత్యేక హోదా అమలు చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి అశలు వమ్ము చేయొద్దని అన్నారు. తన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్కపార్టీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.