లాటరీ పద్ధతి అశాస్త్రీయం: పాల్వాయి
రాజ్యసభ సభ్యులను లాటరీ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు కేటాయించడం అశాస్త్రీయమని సీనియర్ ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి రాజ్యసభకు ఎంపికైన వారిని ఆంధ్రా, తెలంగాణ వారీగా ఉంచాలని, తాము ఇప్పటికే తమ సొంత జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నామని పాల్వాయి చెప్పారు. తమ వాదనను ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుందని, బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్డినెన్స్ చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
కాగా, రాజ్యసభ సభ్యులను లాటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించడంపై పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో డ్రా వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం 4 దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.