వాషింగ్టన్: వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియలో మార్పులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. కంప్యూటర్ లాటరీ విధానానికి స్వస్తిచెప్పే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించనున్నారు. వీసాల ప్రక్రియలో ఈ మార్పు చేయడం వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. కొత్త విధానంపై గురువారం ఫెడరల్ రిజస్టర్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ (డీహెచ్‌ఎస్)కు నెల రోజుల్లోపు తెలియజేయవచ్చు.
లాటరీ స్థానంలో వేతనాల ఆధారంగా వీసాల జారీని ప్రారంభిస్తే ఆయా రంగాల్లోని ఉద్యోగులకు ఇచ్చే అత్యధిక వేతనాన్ని, అదే రంగంలో పనిచేసేందుకు వచ్చే విదేశీ వృత్తినిపుణుడికి కంపెనీ ప్రతిపాదించిన వేతనాన్ని పోల్చి చూస్తారు. ఈ పద్ధతి వల్ల అటు అమెరికన్ ఉద్యోగులకు, ఇటు హెచ్1బీ వీసాదారులకూ సమన్యాయం జరుగుతుందని డీహెచ్‌ఎస్ తెలిపింది. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించేందుకు లేదా అత్యధిక వృత్తి నైపుణ్యాలు ఉన్న వారి కోసం దరఖాస్తు చేసేందుకు వీలు కల్పిస్తుందని డీహెచ్‌ఎస్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ కుచినెల్లీ తెలిపారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మార్పులు ఉన్నట్లు ఆయన చెప్పారు.
హెచ్1–బీ వీసా వ్యవస్థ తరచూ దుర్వినియోగమవుతోందని, తక్కువ వేతనాలతో పనిచేయించుకునేందుకు కంపెనీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఆ నేపథ్యంలో ట్రంప్ వీసాల జారీ ప్రక్రియలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 22న హెచ్1–బీ, ఎల్–1 వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా వీసా వ్యవస్థను సంస్కరిస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనూ హామీ ఇచ్చారు. 2014 నుంచి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్1–బీ వీసాల నోటిఫికేషన్ జారీ అయిన తొలి ఐదు రోజుల్లోనే ఏడాది కోటాకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందుకుంటోంది. ఒక ఏడాదికి గరిష్టంగా 65000 హెచ్1–బీ వీసాలు మాత్రమే జారీ చేస్తారన్నది తెలిసిన విషయమే.
Comments
Please login to add a commentAdd a comment