► బాలుడిని మందలిస్తే... అతడి స్నేహితుడు వెంటపడ్డాడు
► ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
► వేధింపులు భరించలేక బాలిక బలవన్మరణం
► నిందితుడు సైతం మైనరే కావడం గమనార్హం
రాజేంద్రనగర్: ప్రేమ వేధింపులు బాలిక ఉసురు తీశాయి. గతంలో వెంటపడిన బాలుడి స్నేహితుడే ఆమె పాలిట విలన్‌గా మారాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వేధింపులు కొనసాగాయి. వీటిని తాళలేకపోయిన బాలిక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు... మైలార్‌దేవ్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దంపతులు స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శాంతినగర్‌కు చెందిన మైనర్ (17) గతంలో ప్రేమ పేరుతో ఈమెను వేధించాడు. తన స్నేహితులతో కలిసి వచ్చి ప్రేమించమని వెంటపడేవాడు. ఈ విషయాన్ని బాలిక నాలుగు నెలల క్రితం తల్లిదండ్రులకు తెలిపింది. వారు సదరు మైనర్‌ను మందలించడంతో ఆ సమస్య తీరింది. నెల రోజులుగా అతడి స్నేహితుడి రూపంలో మరో సమస్య బాలికను చుట్టుముట్టింది. గతంలో ఈమె వెంటపడిన మైనర్‌కు స్నేహితుడైన శాంతినగర్‌కే చెందిన మరో మైనర్ ఈ బాలిక వెంటపడటం ప్రారంభించాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నా.. నన్ను ప్రేమించు’.. అని వేధించసాగాడు. ఆమె సెల్‌ఫోన్ నెంబర్ కూడా సంపాదించి తరచూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పంపి మానసికంగా హింసిస్తున్నాడు. రోజు రోజుకూ వేధింపులు శృతిమించడంతో బాలిక ఈ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె 20 రోజుల క్రితం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాలుడిని ఠాణాకు పిలిచి మందలిస్తామని పోలీసులు చెప్పడంతో బాలిక తల్లి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు బాలికకు సదరు మైనర్ మరోసారి ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడినందుకు బాలికను తల్లి మందలించింది. తండ్రి వచ్చాక విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి, మరోసారి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామని చెప్పింది. చదువుకునే నీకు ఇంత చిన్న వయసులోనే సెల్‌ఫోన్ ఎందుకని చెప్పి తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లింది. అదే సమయంలో బాలిక చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిద్రలేచిన బాలిక సోదరుడు విషయాన్ని గుర్తించి స్థానికులతో పాటు తల్లిదండ్రులకు తెలిపాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో మైనర్లు...
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్‌తో పాటు గతంలో బాలికను వేధించిన బాలుడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్ల కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరినీ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బాలిక సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని కాల్‌డేటా, ఎస్సెమ్మెస్‌ల వివరాలను విశ్లేషిస్తున్నారు.
పోలీసులు స్పందించలేదు...
బాలుడు తన కుమార్తెను వేధిస్తున్న విషయంపై తాను మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేన్‌లో 20 రోజుల క్రితం ఫిర్యాదు చేశానని బాలిక తల్లి బుధవారం మీడియాకు తెలిపింది. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుని ఉంటే తన బిడ్డ బతికి ఉండేదని రోదిస్తూ చెప్పింది. ఈ విషయంపై మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కుమార్‌ను వివరణ కోరగా... తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాలికను ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్యకు పురిగొల్పిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు. మైనర్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9491292424 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన/ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆమె హామీ ఇచ్చారు.