తెలుగుదేశం పార్టీ మహానాడు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల భజనలకే పరిమితమైంది.
- దశ, దిశ లేకుండా సాగిన మహానాడు
- కార్యకర్తలు, నేతల్లో నమ్మకం కలిగించలేకపోయిన వైనం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల భజనలకే పరిమితమైంది. కార్యకర్తలు, నాయకులకు దిశా, నిర్దేశం చేయటంతో పాటు, కేంద్రం నుంచి ఎలాంటి సాయం రావటం లేదని ఆందోళన లో ఉన్న ప్రజల్లో భరోసా నింపి, ఆత్మ విశ్వాసం కల్పించటంలో పూర్తిగా విఫలమైంది. పార్టీ 35వ మహానాడు శుక్రవారం నుంచి ఆదివారం వరకూ తిరుపతిలో జరిగింది. ఇందులో 28 తీర్మానాలు ఆమోదించారు. 29 గంటలపాటు చర్చించారు.
ఈ చర్చల సమయం, ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలతో కలుపుకుంటే సుమారు 13 గంటలపాటు చంద్రబాబు ప్రసంగించారు. ఆయన ఏపీ శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీలను విమర్శించే లక్ష్యంగానే ప్రసంగం కొనసాగించారు. బాబు, లోకేశ్, బాలకృష్ణల ప్రసంగాలు ఎవ్వరినీ ఆకట్టుకోలేదు. మహానాడులో ప్రసంగించిన మొత్తం 146 మంది నేతలు, కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌లను పొగిడేందుకు పోటీ పడ్డారు.
తెలంగాణ పార్టీ గోడు గాలికి...: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆ రాష్ర్ట సీఎం కె. చంద్రశేఖరరావును విమర్శిస్తూ చేసిన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఈలలు, కేకలతో మహానాడు ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ ప్రాంత నేతలు మీరు భరోసా ఇచ్చి, అండగా ఉంటే పార్టీని అక్కడ బతికి బట్ట కట్టిస్తామని బాబును ప్రాధేయపడినా ఆయన భరోసా ఇవ్వలేదు. మోత్కుపల్లి నర్సింహులు వంటి సీనియర్ నేతలు ప్రశ్నించినా జవాబు లేదు.