- రెండు పిస్టళ్లు, 15 బుల్లెట్లు స్వాధీనం
- ఆరు నెలలు రెక్కీ చేసిన గ్యాంగ్
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ యత్నం కేసులో ప్రధాన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 2 పిస్టల్స్, 15 బుల్లెట్లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సందీప్ శాండిల్యా వివరాలు వెల్లడించారు. గత నెల 4న మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనా న్స్ చోరీ యత్నం కేసులో ముంబై కల్యాణీకి చెందిన మహ్మద్ షరీఫ్ అబ్దుల్ ఖాద్రీ(42) ప్రధాన నిందితుడు.
ఏడుగురితో కలసి షరీఫ్ మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌పై 6 నెలలు రెక్కీ నిర్వహించాడు. చోరీ అనంతరం గాల్లో కాల్పులు జరిపి పారిపోవాలని భావించినా..జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో దిక్కుతోచక తలో దిక్కు పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, శుక్రవారం షరీఫ్‌ను మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన షరీఫ్...
షరీఫ్‌ది తొలి నుంచీ నేర చరిత్రే. యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాకు చెందిన ఇతడు 1994లో ముంబైకి మకాం మార్చా డు. రెండేళ్లు సెలూన్‌లో పనిచేసిన తర్వాత స్నేహితులతో స్క్రాప్ బిజినెస్ మొదలుపెట్టాడు. 1999లో థానేలో దోపిడీకి యత్నించి అరెస్టయ్యాడు. థానే జైల్లో ఫిరోజ్ పరిచయమయ్యాడు. భారీ చోరీకి పథకం వేయాలని సూచించిన ఫిరోజ్ సర్దార్‌ను పరిచయం చేశాడు. 2008లో ఆరుగురు సభ్యులతో కలసి మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లో నగల షాపునకు వస్తున్న యజమానిపై దాడి చేసి, కిలో బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు.
పోలీసులకు చిక్కి, ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక జైల్లో పరిచయమైన అర్షద్, షఫీతో కలసి గుజరాత్ (2015)లో కారు చోరీ చేశాడు. అదే కారును తాజా కేసులో ఉపయోగించాడు. అనంతరం అర్షద్, షఫీ, రాజేశ్, ఫరూక్, సంతోష్, మహ్మద్ దస్తగిరి, షేరుతో కలసి ముఠాగా ఏర్పడిన షరీఫ్ భారీ చోరీకి పథకం వేశాడు. అందులో భాగంగానే మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌ను ఎంచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
చోరీ స్కెచ్‌కి 3 లక్షల ఖర్చు
చోరీకి పథకం వేసిన షరీఫ్ గ్యాంగ్... రూ.35 వేలు చెల్లించి యూపీకి చెందిన షేరు నుంచి 2 పిస్టళ్లు, 15 బుల్లె ట్లు కొనుగోలు చేసింది. ఈ ముఠా ముత్తూట్‌లో చోరీకి రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. షరీఫ్ వద్ద మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లె ట్లు పోలీసులకు చెందినవిగా భావిస్తున్నారు. అవి యూపీ పోలీసులవి అయివుండవచ్చని తెలుస్తోంది. వీటిపై విచారణ జరుపుతున్నామని సీపీ చెప్పారు.