న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో కక్షిదారులు కోర్టులకొస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించినప్పుడే న్యాయవ్యవస్థలో ప్రమాణాలు పెంచగలమని తెలిపారు. 67వ గణతంత్ర దినోవత్సవ వేడుకల్లో భాగంగా హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత ముఖ్యమన్నారు. దీనిని గుర్తించే హైకోర్టులో సాంకేతికపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ఆయన వివరించారు. కేసు విచారణ స్థితిగతులను తెలుసుకునేందుకు కియాస్క్‌లను, ఏ కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు డిస్‌ప్లే బోర్డులు, న్యాయవాదులకు ఎస్‌ఎంఎస్‌లు తదితర సౌకర్యలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిష్ట్రార్ జనరల్, ఇతర రిజిష్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు.