Justice Dilip B . Bosale
-
తప్పు చేస్తే ఆమ్వే పై చర్యలు తీసుకోండి: హైకోర్టు
చట్ట విరుద్ధంగా ఆమ్వే ఇప్పటికీ మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తున్నట్లు తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలకు, హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ వ్యాపారం చేస్తోందని, దీనిని అడ్డుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దీనిని మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఇందులో విచారించడానికి ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆమ్వే ఇప్పటికీ గొలుసుకట్టు వ్యాపారం చేస్తోందన్నారు. అయితే చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తుంటే సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. -
కక్షిదారుల నమ్మకాన్ని నిలబెట్టాలి: హైకోర్టు చీఫ్ జస్టిస్
న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో కక్షిదారులు కోర్టులకొస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించినప్పుడే న్యాయవ్యవస్థలో ప్రమాణాలు పెంచగలమని తెలిపారు. 67వ గణతంత్ర దినోవత్సవ వేడుకల్లో భాగంగా హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత ముఖ్యమన్నారు. దీనిని గుర్తించే హైకోర్టులో సాంకేతికపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ఆయన వివరించారు. కేసు విచారణ స్థితిగతులను తెలుసుకునేందుకు కియాస్క్‌లను, ఏ కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు డిస్ప్లే బోర్డులు, న్యాయవాదులకు ఎస్ఎంఎస్లు తదితర సౌకర్యలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిష్ట్రార్ జనరల్, ఇతర రిజిష్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు.