*చట్టం అమలు చేయకపోతే ఉద్యమం
*ప్రాణహిత ప్రాజెక్టును నీరు గార్చేందుకే రీ డిజైన్
*రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే రైతులకు అండగా ఉంటామని వారికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తెలిపారు. 2013 భూ సేకరణ చట్టమే శ్రీరామ రక్ష అని ఆ చట్టం అమలు అయ్యే వరకు పోరాటాలు చేసి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ కింద ముంపునకు గురయ్యే 14 గ్రామాల ప్రజలు శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 గ్రామాలలో సుమారు 20 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మూడు వేలకు పైగా ఇళ్ళు ముంపు అవుతున్నాయని నిర్వాసితులు వివరించారు. నిర్వాసితుల సమస్యలను విన్న కాంగ్రెస్ నాయకులు వారికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అప్రజాస్వామిక పద్దతులలో కార్యక్రమాలు చేపడుతుందని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలు అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ తెచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే భూ సేకరణ చట్టం చేసిందని, అందువల్ల చట్టం అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందని అయితే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందన ఆయన విమర్శించారు. 20 వేల ఎకరాలను ముంచి కడుతున్న ప్రాజెక్టు కింద ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో కూడా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ నాయకులంతా కలిసి ముంపు గ్రామాలను సందర్శించి ప్రజలు పక్షాన నిలబడుతామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.