
వైఎస్ హయాంలోనే 36 ప్రాజెక్టులు: మల్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులతోనే రాష్ట్రంలో జలకళ సాధ్యమైందన్నారు. జూరాల, శ్రీశైలం, నిజాంసాగర్, మిడ్‌మానేరుతో సహా ఇప్పుడు నిండిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిచేసినవేనన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి వంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపాదించిందని మల్లు రవి గుర్తుచేశారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.