
నిరుద్యోగులకు ‘పచ్చ’ని కుచ్చుటోపీ
♦ నిరుద్యోగ భృతికి మంగళం..
♦ దానికి బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామంటూ కొత్త పల్లవి
♦ యువజన విధానం తేనున్నామన్న ఆర్థిక మంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాం.. ఒకవేళ ఉద్యోగాలివ్వలేకపోతే.. ఉద్యోగం ఇచ్చేవరకూ నెలకు రూ.రెండు వేల చొప్పున నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాం... గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఇదే విషయాన్ని ప్రధానంగా చెప్పింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఒక్కరికీ ఉద్యోగమివ్వలేదు.. అలాగని నిరుద్యోగ భృతి ఇస్తున్నదా? అంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏకంగా నిరుద్యోగ భృతి హామీకే పూర్తిగా మంగళం పలికేస్తోంది. దానిస్థానంలో ఆర్థిక మద్దతు అంటూ కొత్త పల్లవిని ఎత్తుకుంది.
ఇదే విషయం సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నోటినుంచే వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి పలు శాఖల మంత్రులు, అధికారులతో ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీకి బదులు ఆర్థిక మద్దతు అందచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన హామీలన్నింటినీ చాలావరకూ అమలు చేశామని, నిరుద్యోగ భృతి, యువత ఆర్థికాభివృద్ధి హామీల్నే నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి హామీని ఆర్థిక మద్దతుగా మార్చుతామని చెబుతూ.. ఇందుకోసం త్వరలోనే యువజన విధానం తీసుకువస్తామన్నారు. యువజన విధానం అమలుకోసం గతం కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఖాళీగా పోస్టులన్నీ భర్తీ చేయం..
ఇదిలా ఉండగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపైనా ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయబోమని కుండబద్దలు కొట్టారు. జనాభాలో 35 శాతం మంది యువత ఉన్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు కొంతవరకు మాత్రమే ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆ ప్రకారం.. అవసరమైన మేరకే గ్రూప్-1, 2తోపాటు డాక్టర్, టీచర్, పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని తెలిపారు.
క్రమబద్ధీకరణపై 29న కేబినెట్ సబ్‌కమిటీలో చర్చిస్తాం..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎక్కువ నిధుల్ని కేటాయిస్తామని యనమల చెప్పారు. అలాగే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలను చేసుకున్నామని, అవన్నీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని, తద్వారా ప్రైవేట్ రంగంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 29వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని యనమల చెప్పారు.
బడ్జెట్ పుస్తకాలకోసం బ్యాగ్‌ల పరిశీలన..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ పుస్తకాలను సభ్యులకు పంపిణీ చేసేందుకు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి యనమల పరిశీలించారు. ఈ సందర్భంగా పది రకాల బ్యాగ్‌లను అధికారులు తీసుకొచ్చారు. అయితే ఒక్కో బ్యాగ్ ధర రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు ఉండటంతో యనమల ఇంత ఖరీదైన బ్యాగులవసరమా? గతేడాది గన్నీ బ్యాగుల్లో పుస్తకాలిచ్చాం.. ఈసారీ అవేఇస్తే సరిపోదా అని వ్యాఖ్యానించారు.
ఆర్థిక మద్దతు అంటే.. : గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని యువత నుంచి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హామీకి పూర్తిగా మంగళం పలుకుతున్న ప్రభుత్వం ఇందుకు బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామని పేర్కొనడం ద్వారా నిరుద్యోగ యువతను సంతృప్తి పరచాలని చూస్తోంది. అయితే ఆర్థిక మద్దతు అంటే.. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీపై రుణాల్ని ఇప్పించాలనేది ప్రభుత్వ అభిప్రాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు ఒనగూరే ప్రయోజనం అంతంతేననే భావన వ్యక్తమవుతోంది.