భారీ చోరీ
Published Mon, Oct 3 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
భాగ్యనగర్‌కాలనీ: కూకట్‌పల్లి ఠాణా పరిధిలో ఓ భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.21 లక్షల విలువ చేసే 71 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు...హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్న పాండురంగయ్య అనే వ్యక్తి ఆగస్టు 20న శ్రావణ శుక్రవారం ఉండటంతో బ్యాంక్ లాకర్‌లో ఉన్న నగలు తెచ్చి.. లక్ష్మీపూజలో పెట్టారు. తర్వాత వాటిని బీరువాలో భద్రపర్చారు.
అదే రోజు రాత్రి ఇంటి యజమానులు నిద్రలో ఉండగా.. కిటికీ నుంచి తలుపు గడియ తీసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 71 తులాల నగలు ఎత్తుకెళ్లారు. అదే రోజు బాలాజీనగర్‌లో వరుసగా మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బాధితులను రాళ్లతో కొట్టి పరారయ్యారు. బాధితుడు పాండురంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మరునాడే నిందితుడిని పట్టుకున్నట్టు తెలిసింది. అయితే, పోలీసులు ఈ చోరీ విషయాన్ని బయటకు పొక్కకుండా దర్యాప్తు చేస్తుండటం గమనార్హం.
Advertisement
Advertisement