
11న మేయర్ ఎన్నిక
♦ జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి
♦ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాం
♦ పురానాపూల్ రీపోలింగ్‌లో 47.04 శాతం ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఈనెల 11వ తేదీన జరుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటీసును శుక్రవారమే నూతన కార్పొరేటర్లకు అందజేసినట్లు చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లందరికీ వెంటనే గెలుపు ధ్రువపత్రాలు అందజేశామని చెప్పారు.
పురానాపూల్‌లో రీపోలింగ్ సందర్భంగా 47.04 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఒక్క జాంబాగ్ కేంద్రంలో మాత్రం రీకౌంటింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసారి గతంలో కంటే అతి తక్కువగా ఫిర్యాదులు అందాయని... ఈవీఎంలలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. ఎంతో సవాల్‌తో కూడుకున్న ఎన్నికల నిర్వహణను అందరి సహకారంతో విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పోలింగ్‌లో, కౌంటింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని... సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకున్నామని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
మేయర్ ఎన్నిక విధానమిదీ..
11వ తేదీన జరుగనున్న ఎన్నికలో కార్పొరేటర్లలో ఒకరిని మేయర్‌గా ఎన్నుకుంటారు. ఇందులో కార్పొరేటర్లతో పాటు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ ఓటు హక్కు ఉంటుంది. మేయర్ ఎన్నికకు దాదాపు మూడు రోజుల ముందు ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఆహ్వానాలు పంపుతారు. ఈ ఎక్స్‌అఫీషియో సభ్యులెవరూ ఇతర ఏ కార్పొరేషన్‌లోనైనా ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు వేసి ఉండకూడదు. ఈ మేరకు డిక్లరేషన్‌పై వారు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులందరినీ సభా మందిరంలో పార్టీల వారీగా కూర్చోబెడతారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మేయర్ పదవికి ఓటింగ్ నిర్వహిస్తారు.
గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఎవరైనా విప్‌ను ఉల్లంఘించినా... వారు వేసిన ఓటు చెల్లుబాటవుతుంది. కానీ వారిని ఆయా పదవి నుంచి అనర్హులను చేసే అవకాశం ఉంటుంది. మేయర్ ఎన్నిక కు మొత్తం ఓటర్ల (కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు)లో కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు లెక్క. కోరం లేని పక్షంలో గంటసేపు వేచి చూస్తారు. అప్పటికీ సరిపోయినంత మంది సభ్యులు రాకుంటే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. తర్వాతిరోజు కూడా కోరం లేకపోతే తిరిగి నిరవధికంగా వాయిదా వేసి ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మేయర్ ఎన్నిక పూర్తయిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.