
మేయర్ సీటును సీఎంకు బహుమతిగా ఇద్దాం: నాయిని
ముషీరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని రెండేళ్లలో విశ్వకేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ ప్రజలు మేయర్ సీటును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణాలో ‘టీడీపీ క్యాడర్ లేదని, కాంగ్రెస్‌కు నాయకులు లేరని, బీజేపీకి ఓటర్లు లేర’న్నారు. వారికి తెలంగాణ వాదుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
సోమవారం అడిక్‌మెట్ టిఆర్‌ఎస్ కార్యాలయంలో డివిజన్ కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. 15ఏళ్ల అలుపెరగని ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అధికారం చేపట్టిన 18నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమంలో వాడవాడలా తిరిగిన కేసీఆర్ ప్రజల సమస్యలను నేరుగా చూశారన్నారు. అధికారంలోకి రాగానే పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తున్నారన్నారు.
ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా మల్టీలెవల్ ఫ్లైవర్స్ నిర్మించడంతోపాటు సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించారన్నారు. నగరానికి గోదావరి నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నగరంలో 24గంటలు మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గురుచరణ్‌సింగ్, భన్వర్‌సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌లుక్, ముఠా గోపాల్, రేఖారెడ్డి, సునీతాప్రకాష్ గౌడ్, జయరాంరెడ్డి, ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.