జీహెచ్‌ఎంసీలో జోనల్‌ కమిషనర్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో జోనల్‌ కమిషనర్ల బదిలీ

Published Tue, Jul 4 2023 6:22 AM | Last Updated on Tue, Jul 4 2023 6:56 AM

- - Sakshi

హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్‌ఎంసీలో బదిలీలు జరుగుతున్నాయి. కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్‌ సీఈఓగా ఇప్పటికే బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా జీహెచ్‌ఎంసీలోని నలుగురు జోనల్‌ కమిషనర్ల(జడ్‌సీ)ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు మునిసిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఎవరెవరు.. ఎక్కడెక్కడ..
► సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్‌రెడ్డిని నగరంలోనే ఎంతో కీలకమైన, ఐటీతో పాటు వివిధ సంస్థలు కొలువుదీరిన శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉన్న మునిసిపల్‌ పరిపాలన శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జె.శంకరయ్యను జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

► ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఎస్‌.పంకజను ఆ పోస్టు నుంచి రిలీవ్‌ చేశారు. ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అడిషనల్‌ డైరెక్టర్‌ ఎన్‌.రవికిరణ్‌ను శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్విస్తారు.

► చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్‌.అశోక్‌ సామ్రాట్‌ను సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టి.వెంకన్నను చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు.

► సీడీఎంఏలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్‌.ఉపేందర్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం అడిషనల్‌ కమిషనర్‌గా నియమించారు. ఆ విభాగం అడిషనల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వి.మమతను అక్కడినుంచి రిలీవ్‌ చేశారు. చందానగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్‌.సుధాంశ్‌కు శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మహిళా జడ్‌సీలకు మినహాయింపు..
ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.పంకజ, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమతకు ఈ బదిలీల్లో మినహాయింపు నిచ్చారు. వారిని ఎక్కడికీ బదిలీ చేయకపోవడమే కాక వారికి అదనంగా ఉన్న పోస్టుల్లో ఇతరులను నియమించారు. ఇక వారు జోన్లపైనే పూర్తిస్థాయి శ్రద్ధతో పనిచేసే అవకాశం ఉంటుంది. గత బదిలీల సందర్భంగా వీరిద్దరూ తాము బదిలీ అయిన స్థానాలను పరస్పరం మార్చుకోవడం తెలిసిందే. జడ్‌సీల బదిలీల్లో పైరవీలు పనిచేశాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే డిప్యూటీ కమిషనర్ల బదిలీలు కూడా జరగనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement