అంతా తల్లుల దయ..!
సమ్మక్క, సారమ్మల సన్నిధిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్
సిటీబ్యూరో: మేడారం సమ్మక్క, సారలమ్మల దీవెనలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం మేడారం జాతరకు హాజరైన ఆయన నిలువెత్తు బంగారాన్ని(92 కిలోల బెల్లం)అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్‌జిల్లా బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్, మేడారం తల్లుల దీవెనలతోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యానన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్ నగర మొదటి మేయర్‌గా ఎన్నికైన తాను నగర ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంతోపాటు నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే తమ శాఖ ప్రధానోద్దేశమన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారిగా అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అమ్మవార్లకు సోమేశ్‌కుమార్ పూజలు
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని(90కిలోలు) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం రూ. 160 కోట్లు విడుదల చేయడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలకూ మౌలికసదుపాయాలు సమకూరాయన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తరపున..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జనార్దన్‌రెడ్డి తరపున జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ఓ వెంకటరమణ మొక్కులు సమర్పించారు. జనార్దన్‌రెడ్డి బరువు 72 కిలోల బంగారం(బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు.