మేయర్ మాజిద్ రాజీనామా చేస్తారా? | Mayor Majid would resign? | Sakshi
Sakshi News home page

మేయర్ మాజిద్ రాజీనామా చేస్తారా?

Published Fri, Jan 3 2014 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Mayor Majid would resign?

=మేయర్ మాజిద్ రాజీనామా చేస్తారా?
 =పదవి కోసం కాంగ్రెస్ కార్పొరేటర్ల ముమ్మర యత్నాలు
 =ఎవరి అంచనాలు, లెక్కలు వారివే!

 
సాక్షి, సిటీబ్యూరో:  ప్రస్తుత  మేయర్ మాజిద్‌హుస్సేన్ నేడో, రేపో రాజీనామా చేయనున్నారా?, లేక మరికొంత కాలం కొనసాగి చివరి ఏడాది కూడా  ఉంటారా? అనేది ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు.. మేయర్ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు.. చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా, మధ్యలోని రెండేళ్లలో ఎంఐఎం అభ్యర్థి మేయర్‌గా ఉండాలి. ఒప్పందానికి అనుగుణంగా డిసెంబర్‌లోనే మేయర్ మార్పు జరగాల్సి ఉన్నా.. తొలి రెండేళ్లకు ఎన్నికైన మేయర్ కార్తీకరెడ్డి రాజీనామా చేయడంలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల 2012 జనవరి 3న మేయర్‌గా మాజిద్ హుస్సేన్ ఎన్నికయ్యారు.

5న బాధ్యతలు స్వీకరించారు. మాజిద్ ఎన్నికై రెండేళ్లు పూర్తయినందున, తిరిగి కాంగ్రెస్‌కు అవకాశం కల్పించేలా ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. నిర్ణీత వ్యవధిలో గా కాంగ్రెస్ మేయర్ ఎన్నిక జరిగేం దుకు మొదట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్దగా దృష్టి సారించలేదు. పార్టీ శ్రేణుల ఒత్తిడితో ఎట్టకేలకు ఇటీవలే దృష్టిపెట్టారు. ఒప్పందానికి అనుగుణంగా నడచుకునేందుకు ఎంఐఎం కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో.. తమ పార్టీ అభ్యర్థి మేయర్ అయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం కాంగ్రె స్ నుంచి ఎంఐఎంకు లేఖ అందజేశారు.
 
ముమ్మర యత్నాలు..
 
కాంగ్రెస్ నుంచి మేయర్ పదవి ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలోని బీసీ కార్పొరేటర్ ఒకరికి గతంలో ఇస్తామన్న డిప్యూటీ మేయర్ ఇవ్వకపోవడంతో, ఈసారి ఆయనకే మేయర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుండగా, పీఆర్పీ నుంచి పోటీచేసి గెలిచిన మరో కార్పొరేటర్   కేంద్ర మంత్రి చిరంజీవి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గానికి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లు సైతం రేసులో ఉన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గానికి చెందిన మరో కార్పొరేటర్ మర్రి శశిధర్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. శశిధర్‌రెడ్డి ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైనట్టు సమాచారం. నగరానికి చెందిన మంత్రి దానం నాగేందర్ బీసీ కార్పొరేటర్‌కు మేయర్ పదవినివ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, తొలి రెండేళ్లు ఓసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం లభించడంతో.. ఈసారి తమకు చాన్స్ లభిస్తుందని ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాల వారు ఊహాగానాల్లో మునిగారు.   
 
మాకే కావాలి!
 
మరోవైపు,  రిజర్వేషన్ వర్తించినప్పుడు మహిళ, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు మేయర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎలాగూ  ఉంటాయని,  ప్రస్తుతం ఓసీకి అవకాశం ఉన్నందున మిగిలిన ఏడాది సమయాన్ని సైతం తమ వర్గాలకే కేటాయించాలనేది ఓసీల వాదనగా ఉంది. మరో పది, పదిహేనేళ్ల వరకు తమకా అవకాశం రాకుండా పోయే ప్రమాదం ఉందని, కాబట్టి తిరిగి తమకే కేటాయించాలని ఓసీ వర్గాలకు చెందిన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
 
వ్యవధి తక్కువ..
 
ప్రస్తుత మేయర్ రాజీనామా చేసినా.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియకు ఎంతలేదన్నా 20 రోజులు పడుతుంది. దీంతో మేయర్ రాజీనామాపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన డిప్యూటీ మేయర్ రాజీనామా చేశాకే ఎంఐఎంకు చెందిన మేయర్ రాజీనామా చేస్తారని దారుస్సలాం వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్- ఎంఐఎం ముఖ్యనేతలు నేడో, రేపో భేటీ కానున్నారని.. అందులో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్‌ల రాజీనామాలు ఉండవచ్చునని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా పూర్తయ్యే సరికి ఎన్నికయ్యే కొత్త మేయర్‌కు పది నెలలలోపే అధికారమే ఉంటుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement