
రేపు మందుల షాపుల బంద్
హైదరాబాద్: ఆన్‌లైన్లో మందుల కొనుగోలు, అమ్మకాలు సాగించే విధానాలను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటిస్తాయని తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు అమ్మకాల వల్ల అనేకరకాల నష్టం వాటిల్లుతుందన్నారు. అర్హత కలిగిన డాక్టర్‌ను సంప్రదించకుండా పరిమితిలేని మందులను వాడటం వల్ల సొంత వైద్యం ఎక్కువై తద్వారా ఆరోగ్య నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానాలను నిరసిస్తూ జరిగే బంద్‌కు సహకరించాలని వారు కోరారు. మందుల దుకాణాదారుల నిర్ణయంతో రాష్ట్రంలో అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తాయి.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అన్ని చోట్లా ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణాలు, జనరిక్ మందుల దుకాణాలు, సింగరేణికి చెందిన దుకాణాలు, అపోలో, మెడ్‌ఫ్లస్ దుకాణాలు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల్లో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని వెల్లడించారు.