
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ బృందం విస్తృతంగా పర్యటిస్తోంది. తాజాగా మెట్రో రెండో దశకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రముఖ ప్రైవేటు రవాణా రంగ సంస్థ ఎంఐటీ–ఎస్‌యూఐతో ఈ బృందం సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మరోవైపు ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యయానికి సంబంధించి నిధుల సమీకరణకు జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీతోనూ చర్చించినట్లు సమాచారం. రెండో దశ కింద సుమారు ఏడు మార్గాల్లో 81 కి.మీ. మార్గంలో ప్రాజెక్టును చేపట్టాలని గతంలో నిర్ణయించిన విషయం విదితమే.
రెండో దశ ప్రాజెక్టు వ్యయం, భూసేకరణకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం మొదటి దశలోని నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్ల (72 కి.మీ.)లో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించాయి.
రెండో దశపై ఎల్‌అండ్‌టీ విముఖత?
మొదటి దశ పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీ రెండోదశ ప్రాజెక్టు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మొదటి దశలో పెరిగిన అంచనా వ్యయం రూ.3 వేల కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాలని ఈ సంస్థ పట్టుబడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తాము మొదటి దశ పనుల పూర్తిపైనే దృష్టి సారించినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నిధుల కోసం అన్వేషణ...
మెట్రో రెండో దశనుసైతం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇదే క్రమంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశాల్లో పర్యటిస్తోన్న కేటీఆర్ బృందం జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఎంఐటీ–ఎస్‌యూఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆ సంస్థలు ఎలా స్పందించాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ జైకా బ్యాంకు రుణ మంజూరుకు అంగీకరిస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ బ్యాంకుకు పూచీకత్తు(కౌంటర్ గ్యారంటీ) ఇవ్వాల్సి ఉంటుంది.
వడివడిగా ప్రతిపాదనలు రెడీ...
ఏడాది క్రితం మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాల్లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సహ, నగర మెట్రో ప్రాజెక్టు అధికారుల బృందం పలు మార్గాల్లో సర్వే చేపట్టి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతమున్న మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్ర యం వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ ఆదేశాలు, క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే క్రమంలో ప్రతిపాదిత మార్గాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి.
రెండోదశ..
ప్రతిపాదిత రూట్లు: 7
దూరం: 81 కి.మీ.(సుమారు)
అంచనా వ్యయం: సుమారు రూ.20 వేల కోట్లు
మార్గాలివే...
1.నాగోల్–ఎల్బీనగర్: 5 కి.మీ.
2.ఎల్బీనగర్–హయత్‌నగర్: 7 కి.మీ.
3.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ.
4.మియాపూర్–పటాన్‌చెరు: 15 కి.మీ.
5.రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ.
6.తార్నాక–ఈసీఐఎల్: 7 కి.మీ.
7.జేబీఎస్–మౌలాలి: 7 కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment