పూలే ఆశయ సాధనకు పునరంకితమవుదాం: ఈటల
పూలే జయంతి ఉత్సవ ఆహ్వానపత్రం విడుదల
సాక్షి, హైదరాబాద్: ‘మహాత్మా జ్యోతిబాపూలే బడుగు, బలహీనవర్గాల్ని చైతన్యం చేయడానికి జీవితాంతం కృషి చేశారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితమవుదాం, పూలే జయంతి ఉత్సవాలకు ప్రజలంతా తరలి రావాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాత్మా జ్యోతిబాపూలే రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గణేశ్‌చారి, కమిటీ వైస్ చైర్మన్లతో కలసి పూలే జయంతి ఆహ్వానపత్రాన్ని రాజేందర్ ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను విద్యావంతుల్ని చేయడానికి పూలే మహోన్నతమైన కృషి చేశారని, విద్య మాత్రమే పేదల జీవితాల్ని మారుస్తుందని చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 11న జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోందని, అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పూలే ఆశయ సాధన దిశగా ప్రభుత్వం సాగుతోందని, బడుగు, బలహీన వర్గాల ప్రగతితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉద్యమ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఆయావర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
గణేశ్ చారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే బీసీలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిందని, బీసీ వర్గాలకు, కులవృత్తులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.