
వర్షం అంటే భయం వేస్తోంది: కేటీఆర్
వర్షాకాలం అంటేనే ఒక రకంగా భయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడకపోయినా పర్వాలేదని, వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన 70 మినీ జెట్టింగ్ మిషన్లను ప్రారంభించారు. సోమవారం నుంచే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
మ్యాన్‌హోల్స్‌ను మాన్యువల్‌గా శుభ్రం చేయడాన్ని ఇక మీదట పూర్తిగా ఆపేస్తామని, దానికి బదులు ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేయిస్తామని అన్నారు. సివరేజి వ్యవస్థ మొత్తం మారాలంటే రూ. 11 వేల కోట్లు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే వర్షాలు రాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.