
'దాడితో నాకెలాంటి సంబంధం లేదు'
హైదరాబాద్ : ఎవరో అనామకులు చేసిన నేరాలకు తనను బాధ్యుడినిగా చేసి తన బంధువులంటూ వార్తల్లో హల్‌చల్ చేయడం శోచనీయంగా ఉందని తెలంగాణ వాణిజ్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ నగర్ పరిధిలో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తన బంధువులంటూ ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టం ముందు సమానమేనని, ఇలాంటి ఘటనలను ఎవరూ ప్రోత్సాహించరని అన్నారు.
గతంలో జరిగిన సంఘటనల్లో కూడా తన పేరును కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని , దానిపై తన పేరును అనవసరంగా ఉపయోగించుకోకూడదని పత్రికా ఎడిటర్లకు విజ్ఞప్తి చేశానన్నారు. గాంధీ నగర్ సంఘటనపై మంత్రి స్పందిస్తూ 'ఇటువంటి విషయాల్లో నేను సాధారణంగా జోక్యం చేసుకోను నా పేరును ఉపయోగించినందుకే స్పందిస్తున్నానని' తెలిపారు.