ఆకాశంలో అద్భుతం
నేటి నుంచి ‘స్కై ఫెస్ట్’ ప్రారంభం
ఐదు రోజుల సాంస్కృతిక సంబరాలు
సెంట్రల్ యూనివర్సిటీ: రెక్కలు కట్టుకుని పక్షిలా గాలిలో తేలిపోతుంటే.. ఆ అనుభూతిని పొందాల్సిందే.. లేదంటే ప్రత్యక్షంగా చూడాల్సిందే.. ఇప్పుడు ఈ అవకాశం నగరవాసి ముంగిటకొచ్చింది. గాలిలో తేలుతూ ఆనందడోలికల్లో ముంచేందుకు సిటీ ‘స్కై ఫెస్ట్-2015’కు సిద్ధమైంది. ఈ వేడుక బుధవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ గగన పండుగ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు పారాజంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, సినిమాలు, సంగీత ఝరితో ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు కొత్త అనుభూతిని పంచనుంది.
కార్యక్రమాలు ఇవే..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ బృందం ప్రదర్శించే పారా జంపింగ్, వాయు విన్యాసాలు ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్‌లో లాంగ్‌రైడ్, జాయ్ రైడ్ ఉంటాయి. కార్నివాల్‌లో ఆక్రోబాట్స్ డాన్సులు, హిప్‌హప్ జంపింగ్ రోప్, సల్సా, స్టిక్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా రాక్‌బాండ్ ప్రదర్శనలు, ఆరుబయట చిత్రాలు అలరిస్తాయి.
తొలిరోజు డీజే అఖిల్ ప్రత్యేక రాక్‌నైట్ హోరెత్తనుంది. 24న బాద్‌షా, 25న దేవి శ్రీ ప్రసాద్, 26న సోను నిగమ్, 27న తీన్‌మార్ నైట్ పేరిట ఆర్‌పీ పట్నాయక్ సంగీత ప్రదర్శనలు స్కైఫెస్ట్ జోష్‌ను పెంచనున్నాయి. ఇవిగాక చక్కని చిత్రాలను వేలమంది ఆరుబయట తిలకించే అద్భుత అవకాశం ఇందులో ఉంది. నగరంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు న్యూ ఇయర్ జోష్‌ను మోసుకొస్తుందని ఫెస్ట్ నిర్వాహకులు జగదీశ్ రామడుగు, రాణిరెడ్డి, రామ్మోహనరావు తెలిపారు. వేడుక ద్వారా సమకూరిన మొత్తాన్ని ‘స్పర్శ్ హో స్పైస్’ ఆస్పత్రికి అందించి క్యాన్సర్ బాధితులకు స్వాంతన చేకూర్చనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తుంది.