కాపునాడు నేత మిరియాల ఇకలేరు | miriyala venkatrao dead due to illness | Sakshi
Sakshi News home page

కాపునాడు నేత మిరియాల ఇకలేరు

Published Mon, Nov 10 2014 1:52 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

కాపునాడు నేత మిరియాల ఇకలేరు - Sakshi

కాపునాడు నేత మిరియాల ఇకలేరు

సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, కాలేయం, కిడ్నీ పనితీరు మందగించడం తదితర సమస్యలకు ఈ నెల మూడో తేదీ నుంచి ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు.  మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఎం. శేషగిరిబాబు, ఐఏఎస్ అధికారి. ఈపీడీసీఎల్ చైర్మన్‌అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వెంకట్రావును ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఆదివారం ఉదయం పరామర్శించారు. మిరియాల వెంకట్రావు పూర్వీకులు ప్రకాశం జిల్లా వారైనప్పటికీ వ్యాపార రీత్యా కృష్ణా జిల్లా బందరుకు, అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్లారు. మిరియాల శేషయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1939 డిసెంబర్ 25న ఆయన రాజమండ్రిలో జన్మించారు. విద్యార్థి దశలోనే సోషలిస్టు పార్టీ ప్రభావానికి గురయ్యారు. మిరియాల వెంకట్రావు, సినీనటుడు రావుగోపాలరావు, కొండపల్లి భాస్కరరావులు స్నేహితులు.  తొలుత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు.

ఆ తరువాత అటవీ కాంట్రాక్టులు చేశారు. కుల చైతన్యం నుంచి సమైక్యత పుడుతుంది.. సమైక్యత సాధికారిక పాలనకు దారి తీస్తుంది. సంఘీభావమే బలం.. సంఘమే రాజ్యం.. రాజ్యమే విజయం... విజయమే నిజమంటూ వెంకట్రావు పదేపదే చెప్పేవారు. కాపు మహాసభగా, తెలగ అభ్యుదయ సంఘంగా, కాపు తెలగ, బలిజ సంక్షేమ సంఘాలన్నింటినీ ఏకం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. దాంతో 1988లో విజయవాడలో కాపునాడు ఆవిర్భవించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ యాత్ర చేసి కాపు, తెలగ, బలిజ వర్గాల్లో చైతన్యం కలిగించారు. రాష్ట్ర హస్త కళల సంఘం చైర్మన్‌గా, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. సోషలిస్టు, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు.

కాపుల్లో చైతన్యం తీసుకొచ్చారు: సీఎం
వెంకట్రావు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతా పం తెలిపారు. బలమైన సామాజికవర్గానికి విశేష సేవలందించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.  
 
జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
ప్రముఖ కాపు నాయకుడు మిరియాల వెంకటరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరావు కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement