మియాపూర్ : వాహనదారుడిని లిప్ట్ అడిగి....కారుతో పాటు ఉడాయించిన ఓ మాయలేడికి కూకట్పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి. సత్యనారాయణ ఆరు నెలల జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్లో కారులో వెళ్తున్న జి.వెంకట్ రెడ్డిని లిప్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది.
కాగా, వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి.