రోధిస్తున్న అబ్దుల్ ఆసిఫ్, ఎం.డి.మోసిన్ కుటుంబ సభ్యులు
సూరారం: సింగూరు జలాశయంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో కుత్బుల్లాపూర్ సర్కిల్ నెహ్రునగర్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. గల్లంతైన వారిలో అబ్దుల్ రజాక్, తస్లిమా బేగం కుమారుడు అబ్దుల్ ఆసిఫ్ (19) ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు, మహబూబ్, షమీమ్ బేగం కుమారుడు మోసిన్ (21) పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నారు. సమీప బంధువులైన వీరు గురువారం స్నేహితులతో కలిసి సింగూరు డ్యామ్‌కు వెళ్లారు.డ్యామ్‌లో ఈత కొట్టేందుకు వెళుతూ వెళుతూ ఆసిఫ్ కింద పడటంతో అతడి వెనకే వస్తున్న మోసిన్ అతన్ని పట్టుకునే క్రమంలో ఇద్దరు నీటిలో పడి గల్లంతయ్యారు. డ్యామ్ అధికారులు గజ ఈతగాళ్లను సహాయంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఫలితం కనిపించలేదు. స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింగూరు డ్యామ్ ఏరియా పోలీసులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.