
తెలంగాణను అడ్డుకున్నవారికే కాంట్రాక్టులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వారికే భారీ కాంట్రాక్టులు దక్కుతున్నాయని, తెలంగాణ కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.
సర్కార్‌పై ఎమ్మెల్సీ పొంగులేటి ధ్వజం
♦ నిబంధనల ప్రకారమే కాంట్రాక్టులు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వారికే భారీ కాంట్రాక్టులు దక్కుతున్నాయని, తెలంగాణ కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్ల కేటాయింపులను ఆహ్వానిస్తున్నప్పటికీ, ఎవరికి కట్టబెట్టేందుకు అంత భారీ కేటాయింపులు జరిపారని ప్రశ్నించారు. శాసనమండలిలో శుక్రవారం 2016-17 బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఊహా ప్రపంచంలో విహరింపజేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో ఇప్పటికే రూ. 3 వేల కోట్లు అధికంగా చెల్లింపులు చేశారని, వేల కోట్లు దోపిడీకి రంగం సిద్ధమైందని విమర్శించారు. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన కాంట్రాక్టరుకు నాగార్జునసాగర్ ప్రధాన స్పిల్‌వే పనులు అప్పగించడంలో అంతరార్థం ఏంటని ప్రశ్నిం చారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు రూ. 10 కోట్లకన్నా ఎక్కువ కాంట్రాక్టులు ఇవ్వడం లేదని, సొంత రాష్ట్రం వస్తే స్వయంపాలన సాధిస్తామనడం ఇదేనా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రతో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు.
పోలవరంను గాలికి వదిలేశారని, ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న 4 లక్షల మంది తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదని అన్నారు. పోలవరం రీ-డిజైనింగ్ చేయించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరాలపై ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా ఉంటాయని, అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ఈపీసీ, మొబెలైజేషన్ అడ్వాన్స్‌ల విధానాన్ని కూడా తొలగించి పారదర్శకంగా టెండర్లు వేసిన వారికే కాంట్రాక్టులు ఇచ్చినట్లు తెలిపారు.అంతకు ముందు చర్చను ప్రారంభించిన పూల రవీందర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.