‘పోలీసు’ అభ్యర్థుల కోసం మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 'findme' మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జేఎన్‌టీయూహెచ్ సహకారంతో టీ-హబ్ స్టార్టప్ కంపెనీలోని యాప్‌స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీ ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. దీనిని బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మ తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ యాప్ ద్వారా సంబంధిత పరీక్షా కేంద్రం ఫోన్ నంబర్‌తో పాటు గూగుల్ నేవిగేషన్‌ను కూడా పొందవచ్చు. అలాగే పరీక్షా సమయంలో అభ్యర్థులకు తాగునీరు, ఇతరత్రా సమస్యలు తలెత్తితే పరీక్ష ముగిసిన అనంతరం యాప్ ద్వారా తెలిపే వీలుంది. తద్వారా పరీక్షా కేంద్రంపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నారు.