
డ్రోన్.. భళా!
♦ 70 కిలోల బరువున్న మర మనిషితో ఎగిరిన మ్యాన్డ్ ఆక్టో కాప్టర్
♦ చిరెక్ విద్యార్థుల ఘనత.. దేశంలోనే తొలి ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా గాల్లో ఎగిరి వీడియోలు, ఫొటోలు తీసే డ్రోన్‌లనే చూశాం.. కానీ హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మనిషిని కూడా గాల్లోకి తీసుకెళ్లగలిగే డ్రోన్ హెలికాప్టర్ (ఆక్టో కాప్టర్)ను రూపొందించారు. బుధవారం కొండాపూర్‌లోని స్కూల్ ఆవరణలో 70 కిలోల బరువున్న మర మనిషితో ఆక్టో కాప్టర్‌ను విజయవంతంగా గాల్లోకి ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఇలాంటి ప్రయోగం చేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగానికి మరింత పదును పెడితే మ్యాన్డ్ ఆక్టో కాప్టర్‌ను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉపయోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు.
స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న వినయ్ కనుమూరి, వినీత్ ఆలపాటి, అమోగ్ ఇస్కా, ఆదిత్య మద్దుకూరి పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సహకారంతో దీన్ని తయారు చేశారు. ఏడాదిపాటు శ్రమించి, రూ.8.5 లక్షల ఖర్చుతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. చివరికి రిమోట్ సాయంతో 15 అడుగుల ఎత్తు వరకు విజయవంతంగా ఎగురవేశారు. మరో 8 నెలల తర్వాత మనిషిని కూర్చోబెట్టి ఆక్టో కాప్టర్‌ను ఎగురవేస్తామని వైస్ ప్రిన్సిపల్ వెంకట్ రామన్ తెలిపారు. దీనికి 100 అడుగుల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉందన్నారు. మనిషితో ఎగిరే డ్రోన్‌ను తయారు చేయడం ఎంతో స్ఫూర్తి్తనిచ్చిందని విద్యార్థి అమోగ్ ఇస్కా పేర్కొన్నాడు.