నిధులిచ్చినా.. సౌకర్యాలు సున్నా | Money given facilities to zero | Sakshi
Sakshi News home page

నిధులిచ్చినా.. సౌకర్యాలు సున్నా

Published Fri, Aug 5 2016 3:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

Money given facilities to zero

ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు కనీస వసతులు, ఇతర సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వపరంగా ఆదేశాలిచ్చి, నిధులు మంజూరు చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లు, టు టయర్ కాట్‌లు, అల్మారాలు, టీచర్లు, సిబ్బందికి టేబుళ్లు, కుర్చీలు తదితరాల ఏర్పాటు కోసం గత ఏడాది చివర్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్  ఆదేశాలిచ్చారు.

రూ.125 కోట్లు కూడా కేటాయించారు. గతంలోనే వీటిపై నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వపరంగా రాష్ర్టస్థాయి కొనుగోలు కమిటీ ఖరారు కాకపోవడంతో ఆయా సౌకర్యాల కల్పన ఆగిపోయింది. హాస్టల్ విద్యార్థులకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో భాగంగానే ఆయా సౌకర్యాలను కల్పించాలని గత డిసెంబర్ 28న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత ఆర్థిక  సంవత్సరం ముగియడంతో పాటు 2016-17లో కూడా నాలుగు నెలలు గడిచినా ఆయా సౌకర్యాల కల్పనకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు.  
 
 సీసీ కెమెరాలు, కంప్యూటర్లదీ అదే పరిస్థితి
మారుమూల ప్రాంతాల్లోని బాలికల హాస్టళ్ల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. అయినా అధికార  యం త్రాంగం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ర్టంలోని 152 గిరిజన బాలికల పాఠశాలలు, హాస్టళ్ల (99 బాలికల ఆశ్రమ పాఠశాలలు, 53 బాలికల హాస్టళ్లు)లో 152 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు (సీసీ టీవీలు) వాటి పర్యవేక్షణకు కంప్యూటర్ల ఏర్పాటునకు గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఒక్కో సీసీ టీవీ ఏర్పాటునకు రూ.5 వేల చొప్పున రూ.7.6 లక్షలకు, ఒక్కో కంప్యూటర్ ఏర్పాటునకు రూ. 22,879 చొప్పున రూ.34.70 లక్షలకు అంచనా వేసి మొత్తం 152 సీసీటీవీ, 152 కంప్యూటర్ల కొనుగోలుకు అనుమతినిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అధికారులకు ఆదేశాలు పంపించినా ఇప్పటివరకు వాటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న 1,22,604 మంది విద్యార్థులకు ఒక జత స్పోర్ట్స్ షూ, రెండు జతల సాక్స్‌ను అందజేయాలని మంత్రి చందూలాల్ ఆదేశించారు. దీనిపై కూడా అధికారుల్లో సానుకూల స్పందన కొరవడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement