పాముదీ ప్రాణమే...
మదర్ ఎర్త్
ఇంట్లోగాని, ఇంటి పరిసరాల్లోకి గాని పొరపాటున ఓ పామో, తేలో కనిపిస్తే అందరికీ వచ్చే మొదటి ఆలోచన దాన్ని ఎలా చంపాలి అని. అంతే కానీ దాన్ని కాపాడే అవకాశం ఏదైనా ఉందా అనే ఆలోచన ఏ మాత్రం రాదు. వాస్తవానికి మన ఇంటి పరిసరాల్లోకి వచ్చే ప్రతి పురుగును, ప్రతి పామునూ చంపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ‘భయం’ కొద్దీ మనం చంపేస్తుంటాం. కానీ, అలా చేయకుండా ఆ జీవుల్ని కాపాడి, వాటిని ఊరి చివర్లో, అడవుల్లోనో వదిలిపెట్టడమే నిజమైన మానవత్వం. అలా చేయడానికి గొప్ప ధైర్య సాహసాలు అవసరం లేదు. వాటిదీ మనలాంటి ప్రాణమే అని గుర్తిస్తే చాలు.
‘భారతీయ ప్రాణి మిత్ర సంఘ్’ అనే సేవా సంస్థ ఉంది. హైదరాబాద్‌తోపాటు జిల్లాలన్నింటిలోనూ యానిమల్ వెల్ఫేర్ కమిటీలు పని చేస్తున్నాయి. ఎవరింట్లోకైనా పాము వస్తే, దానికి హాని తలపెట్టకుండా వారికి సమాచారం చేరవేస్తే చాలు. వారి మనుషులు వచ్చి ఆ పామును పట్టుకొని తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తారు లేదా జూలకు ఇస్తారు. మూగ జీవుల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి అద్భుతమైన సేవను ప్రారంభించిన ఆ సంస్థకు అభినందించాల్సిందే. ఎవరికి వారు తమకు సమీపంలోనే ఈ స్వచ్ఛంద కార్యకర్తల నంబర్లను దగ్గర ఉంచుకుంటే మంచిది.