హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లి బకెట్‌లోని నీటిలో ముంచి హత్యకు పాల్పడింది. అవివాహిత అయిన ఆమెకు వివాహేతర సంబంధం వల్ల శిశువు జన్మించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన జి.హేమజ (22) మూడు రోజుల క్రితం గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని కాకతీయ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరింది. విధుల్లో ఉన్న హేమజకు సోమవారం రాత్రి 1.30 గంటలకు బాత్‌రూమ్‌లో డెలివరీ అయ్యింది. శిశువు ఏడుపు వినిపించడంతో స్టాఫ్‌నర్సు కృష్ణమ్మ బాత్‌రూమ్ తలుపు తట్టింది.
ఎంతకూ గడియ తీయని హేమజ తనకు జన్మించిన మగ శిశువును బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఎట్టకేలకు బాత్‌రూమ్ డోర్ తెరిపించి చూడగా డెలివరీ కాగానే శిశువును హత్య చేసిందని గుర్తించి, కాకతీయ ఆస్పత్రి జీఎం చంద్ర మధుసూదన్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత శిశువును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హేమజ కాకతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివాహేతర సంబంధం కారణంగానే శిశువు జన్మించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హేమజ తల్లిదండ్రులకు సమాచారం అందించామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
నీటిలో ముంచి శిశువును హత్య చేసిన తల్లి
Published Tue, Apr 4 2017 2:53 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement
Advertisement