సాక్షి ప్రతినిధి, కర్నూలు: మొన్న వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళ ఫోన్ నంబరుకు మీరు ఎందుకు కాల్ చేశారు? మీరు ఆమె వద్దకు వెళ్లినట్టున్నారు. మీపై కూడా కేసు పెడతాం. ఫలానా నగర్‌లో దొరికిన మహిళ ఫోన్‌లో మీ నంబరు ఉంది. అసలు మీ నంబరు ఆమె వద్ద ఎందుకుంది? మీకు, ఆమెకు సంబంధం ఏమిటో విచారణ చేయాలి. ఒక్కసారి స్టేషన్‌కు రండి.. ఇవీ ఈ మధ్య కాలంలో పలువురికి ఓ పోలీసు అధికారి నుంచి వస్తున్న ఫోన్‌కాల్స్ ఇది విచారణలో భాగమే కదా అనుకోవచ్చు. అయితే, కథ ఇంతటితో ఆగడం లేదు. వారి మీద కేసులూ పెట్టడం లేదు. విచారించడమూ లేదు. కేవలం స్టేషన్‌కు పిలిపించుకుని బేరం మాట్లాడుకోవడానికే ఈ తతంగమంతా నడుస్తుండటం మొత్తం కథలో అసలు మలుపు.
ఈ విధంగా అనేక మంది వద్ద నుంచి సదరు పోలీసు అధికారి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ విధంగా మామూళ్లు సమర్పించిన వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చిన్న చిన్న వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. తమ పేరు బయటకొస్తే పరువు పోతుందనే భయంతో బాధితులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ ఉండిపోతున్నారు. ఇది కాస్తా సదరు పోలీసు అధికారికి భారీ ఆదాయ వనరుగా ఆమెతో ఎందుకు మాట్లాడారు?మారిపోతోంది. వ్యభిచారం కట్టడి పేరుతో సదరు అధికారి సాగిస్తున్న వసూళ్ల వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం.
ఫోన్ నంబర్ ఉందంటూ...
జిల్లాకేంద్రంలోని బస్టాండుతో పాటు వివిధ శివారు కాలనీల్లో వ్యభిచారం నడుస్తోంది. ఇక కొన్ని లాడ్జీలు ఇదే ‘వ్యాపారం’ చేస్తున్నాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడులు చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్న మహిళలతో పాటు విటులనూ పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సదరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. విటులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, కథ ఇక్కడితో ముగియడం లేదు. ప్రధానంగా కాలనీల్లో నడుస్తున్న వ్యవహారంలో మధ్యవర్తులు ఉంటున్నారు.
వీరు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. దాడుల సందర్భంగా పట్టుబడిన మధ్యవర్తులు, అమ్మాయిల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని నంబర్లతో పాటు కాల్‌డేటా ఆధారంగా పలువురిని విచారణ పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఎక్కడా విచారణ సాగడం లేదు. వ్యభిచారి ఫోన్ నంబరుకు మీరు పదే పదే మాట్లాడారని, మీపై కేసు పెడతామని ఒక పోలీసు అధికారి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా స్టేషన్‌కు వెళ్లిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సదరు పోలీసు అధికారికి భారీ మొత్తంలో సమర్పించుకున్నట్టు సమాచారం.
మధ్యవర్తిగా కానిస్టేబుల్
పోలీస్ అధికారి పిలుపు మేరకు బాధితులు స్టేషన్‌కు వెళ్లగానే కథ అసలు మలుపు తిరుగుతోంది. ఆ స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్ వీరితో మాటలు కలిపి.. కేసు కాకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని బేరసారాలు నడుపుతున్నారు. చివరకు ఒక మొత్తం వద్ద ఒప్పందం కుదురుతోంది. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్ సదరు పోలీసు అధికారికి చేర్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఒక్కొక్కరు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకూ సమర్పించుకున్నారని సమాచారం. ఈ వ్యవహారం కాస్తా పోలీసు బాస్ దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. వ్యభిచారంపై విచారణ పేరిట పోలీసు అధికారి సాగిస్తున్న వసూళ్ల వ్యవహారాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment