సాక్షి, హైదరాబాద్: సిబ్బంది పనితీరుపై మరింత దృష్టి సారించాలని ఉస్మానియా ఆస్పత్రి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది రాకపోకలు, రోగులపట్ల అనుసరిస్తున్న తీరు, వార్డుల్లోని సేవలు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకు రావాలని యోచిస్తున్నారు. అత్యవసర విభాగంలో అర్ధరాత్రి సేవలు నిలిచిపోయిన ఘటనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ స్పందించారు. సోమవారం క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(సీఎంవో), డ్యూటీ ఆర్‌ఎంవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై చర్చించారు.
ఈ విభాగంలో మెరుగైన సేవలు అందించేందుకు మెడిసిన్, సర్జరీల నుంచి ఒక్కో పీజీని కేటాయించేందుకు అంగీకరించారు. ఆర్‌ఎంవోలతో రోజూ మధ్యాహ్నం సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని, సూపరింటెండెంట్ స్థాయిలో సాధ్యంకాకపోతే డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఔట్‌పేషెంట్ విభాగానికి రోజుకు సగటున 2,500 మంది రోగులు వస్తున్నారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులకు సరిపడ సంఖ్యలో వైద్యులున్నా అత్యవసర పరిస్థితుల్లో ఎవరూ అందుబాటులో ఉండటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వల్ల డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కా హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ అటెండెన్స్‌ను వినియోగించుకోవడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా వార్డులపై నిఘా పెంచాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది.
ఇకపై మరింత కఠిన నిర్ణయాలు
నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. రోగులందరికీ సేవలు అందేవిధంగా చూస్తాం. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు, ఆర్‌ఎంవోలు, సిబ్బంది సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా
Comments
Please login to add a commentAdd a comment