థియేటర్లలో కాంబో దోపిడీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని సినిమా థియేటర్లు దోపిడీకి తెరలేపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో టిక్కెట్లను అమ్ముతున్నారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసి కాంబో ప్యాక్తో టిక్కెట్లను అమ్ముతూ థియేటర్ల యజమాన్యాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి టిక్కెట్పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్యాక్లో కనీసం నాలుగు టిక్కెట్లు తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు.
మరోవైపు చిన్న థియేటర్లు కూడా బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతూ దోచేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు చూడాలన్న అభిమానుల ఆశలు తీరడం లేదు. ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్ల చార్జీల రూపంలో అదనంగా వసూలు చేయడానికి తోడు పండుగ సమయంలో కుటుంబం మొత్తం ఆనందంగా సినిమా వీక్షించడం కూడా భారంగా మారిందని సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అసహనంతో వెనుతిరిగుతున్నారు.