
రైతును మోసం చేసే సభ: వినోద్
రైతు గర్జన పేరిట కాంగ్రెస్ నేతలు లేనిపోని అబద్దాలతో వారిని మోసం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతు గర్జన పేరిట కాంగ్రెస్ నేతలు లేనిపోని అబద్దాలతో వారిని మోసం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముమ్మాటికీ కరెక్టేనని సమర్ధించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులతో కలిసి వినోద్‌కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘గతంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మహారాష్ర్ట ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న 250పైగా ప్రాజెక్టులను నిలువరించలేకపోయిందన్నారు.
దాని ఫలితంగానే నేడు వర్షాలు కురుస్తున్నా నేటికీ ఎస్సారెస్పీ నిండక... ఈ ప్రాంత రైతులు నాట్లు కూడా వేయలేని దుస్థితి నెలకొందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే 2014 నుంచి గోదావరిపై నీటి లభ్యతపై సర్వేలు నిర్వహించిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. పదేపదే రీడిజైనింగ్, అవినీతి గురించి మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని సవాల్ విసిరారు.