కాపు ఉద్యమంపై మడమ తిప్పే ప్రశ్నే లేదు
చంద్రబాబు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తాడు.. పట్టించుకోవద్దు: ముద్రగడ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపవచ్చు. ఆందోళనకారులపై నిర్బంధ కాండ కొనసాగవచ్చు. అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఉద్యమానికి నాయకత్వం వహించే వారు అన్నింటికీ సిద్ధపడాలని, క్రమశిక్షణతో మెలిగి ముందుకు తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. ఉద్యమ ఉధృతంపై దిశాదశను ఖరారు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ముద్రగడ, ఆయన అనుచరులు బుధవారమిక్కడ 13 జిల్లాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని ఈనెల 12,13 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు సాధ్యమైనంత వరకు రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తారన్నారు. అన్ని పార్టీల సహకారాన్ని కోరేందుకు త్వరలో లేఖలు రాస్తామన్నారు.
రోశయ్యతో ముద్రగడ భేటీ : అంతకుముందు ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరులు మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్యను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలను తెలుసుకున్నారు.